Breaking News

‘సత్యాగ్రహం ముందు అహంకారం ఓడింది.. ఈ విజయం మీదే’ రైతులకు శుభాకాంక్షల వెల్లువ


నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలంటూ ఏడాదిగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించింది. ఎట్టకేలకు అన్నదాతల ఆందోళనకు దిగొచ్చిన మోదీ సర్కారు.. కొత్త చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, బెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ తదితరులు ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఇది కర్షకుల విజయం’ అంటూ రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. సత్యాగ్రహం ముందు అహంకారం తలవంచిందని అన్నారు. ‘‘దేశ అన్నదాతలు తమ సత్యాగ్రహంతో అహంకారాన్ని తలవంచేలా చేశారు.. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు.. జైహింద్, జైహింద్ ’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరిలో తాను పోస్ట్‌ చేసిన ఓ పాత వీడియోను షేర్ చేసిన రాహుల్.. ‘‘నా మాటలను గుర్తుపెట్టుకోండి.. ప్రభుత్వం బలవంతంగానైనా ఈ చట్టాలను రద్దు చేస్తుంది’’ అని చెప్పడం గమనార్హం. తాను ఆనాడు చెప్పిందే నేడు నిజమైందని రాహుల్ చెప్పకనే చెప్పారు. ‘ఈ ప్రకాశ్‌ దివస్‌ రోజున శుభవార్త విన్నాం.. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు.. వారి త్యాగాలకు ఫలితం దక్కింది. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. దేశ రైతులకు సెల్యూట్‌’’ అంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ.. ‘‘క్రూరత్వానికి చలించకుండా అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతుకు హృదయపూర్వక అభినందనలు.. ఇది మీ విజయం.. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని అన్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ..‘నల్ల చట్టాల రద్దు సరైన ముందడుగు.. రైతుల సత్యాగ్రహం చారిత్రక విజయం సాధించింది. మీ(అన్నదాతల) త్యాగాలు ఫలించాయి’’అన్నారు. టీఎంసీ ఎంపీ డేరక్ ఒబ్రెయిన్ ‘‘అహంకారం ఓడింది.. తలకెక్కిన గర్వం మీ మోకాళ్ల వరకు వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ‘అహంకారం వీగింది.. దేశ రైతు గెలిచాడు’ అని కాంగ్రెస్ పేర్కొంది.


By November 19, 2021 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farm-laws-repeald-opposition-parties-jibe-at-pm-modi/articleshow/87795008.cms

No comments