Bihar షాకింగ్.. కోర్టు హాలులోనే జడ్జికి తుపాకి గురిపెట్టి దాడిచేసిన పోలీసులు!
న్యాయమూర్తికి పోలీసులే తుపాకి గురిపెట్టి దాడిచేసిన షాకింగ్ ఘటన బిహార్‌లోని మధుబని జిల్లాలో చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ జరుగుతుండగా కోర్టు హాలులోకి ప్రవేశించిన ఇద్దరు పోలీసు అధికారులు జిల్లా అడిషనల్ సెషన్సు కోర్టు జడ్జి అవినాశ్ కుమార్‌పై దాడి చేశారు. తుపాకీ గురిపెట్టి దాడి చేయడంతో ఈ అనూహ్య ఘటనతో జడ్జి నిర్ఘాంతపోయారు. దాడిలో గాయపడిన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితులు స్టేషన్ హౌస్ అఫీసర్ గోపాల్ ప్రసాద్, ఎస్సై అభిమన్యు కుమార్‌లు ఘొఘార్డియా స్టేషన్‌లో పనిచేస్తున్నారు. వారి దాడి నుంచి జడ్జిని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కాపాడారు. నిందితులను అడ్డుకుని దేహశుద్ధి చేయడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులిద్దరూ ఓ కేసులో కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా ఈ దాడికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణకు గురువారం రాత్రి 7 గంటలకు ప్రత్యేక విచారణ చేపడుతున్న ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో నవంబరు 29కి సీల్డ్ కవర్‌లో నివేదిక అందజేయాలని బిహార్ డీజీపీని జస్టిస్ రంజన్ గుప్తా, జస్టిస్ మోహిత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ రోజున డీజీపీ సైతం కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం పేర్కొంది. ‘‘ప్రాథమికంగా ఈ ఘటన న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేస్తుంది.. అందువల్ల ప్రతివాదులకు బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. డీజీపీ, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మధుబని ఎస్పీలకు నోటీసులు జారీ చేయడం సరైనదని మేము భావిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది. అటు, జిల్లా అదనపు సెషన్సు కోర్టు జడ్జి (ఏడీజే) అవినాష్ కుమార్‌పై దాడిని ఝాంఝ్‌ర్‌పూర్ బార్ అసోసియేషన్ ఖండించింది. ఇది న్యాయ వ్యవస్థను అణచివేసే ప్రయత్నమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ పేరును సైతం ప్రస్తావించిన బార్ అసోసియేషన్.. ఈ ఘటనలో ఆయన పాత్రపైనా అనుమానాలు లేవనెత్తారు. ఇంతక ముందు నేరస్థుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరేవాళ్లం.. కానీ ఇప్పుడు వారి నుంచి రక్షణ కల్పించాలని కోరాల్సి వస్తోందని బార్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులతో పాటు ఎస్పీ పేరును కూడా చేర్చాలని, సత్వర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరవధిక సమ్మెకు దిగి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
By November 19, 2021 at 09:17AM
No comments