మణిపూర్ ఉగ్రదాడి.. పక్కా వ్యూహాంతో మాటువేసి దెబ్బతీసిన ముష్కరులు
మణిపూర్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి కల్నల్ కుటుంబం సహా ఏడుగురు సైనికులు బలయ్యారు. అసోం రైఫిల్స్‌కు చెందిన కల్నల్ వాహనమే లక్ష్యంగా ఐఈడీల (అధునాతన పేలుడు పరికరం)తో దాడికి పాల్పడ్డారు. అనంతరం ముష్కరులు కాల్పులు జరిపిన ఈ మెరుపు దాడిలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అసోం రైఫిల్స్ 46 వ(ఖూగా) బెటాలియన్‌లో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబిర్‌లతో కలిసి శనివారం ఉదయం వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రవాదులు చురాచాంద్‌పుర్ జిల్లాలోని సెహకాన్ గ్రామం వద్ద ఆయన వాహనమే లక్ష్యంగా ఐఈడీలను పేల్చారు. అనంతరం సమీపంలోని ఎత్తైన ప్రాంతాల నుంచి తూటాల వర్షం కురిపించారు. త్రిపాఠీ బెహియాంగ్ కంపెనీ నుంచి బేస్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు సిబ్బంది తీవ్రవాదుల కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పేలుళ్ల తీవ్రతకు త్రిపాఠీ (41)తోపాటు ఆయన భార్య అనుజ (36), కుమారుడు అబిర్ (8), నలుగురు సిబ్బంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్‌లో కల్నల్‌గా పోస్టింగ్ వచ్చిన తర్వాత తొలిసారి కుటుంబాన్ని తీసుకురాగా.. ఉగ్రదాడిలో వీరంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేవారని, పౌరులకు చాలా సహాయం చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడి చేసింది తామేనంటూ నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), మణిపుర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎంఎన్‌పీఎఫ్)లు శనివారం రాత్రి ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కల్నల్ త్యాగాన్ని గుర్తుంచుకుంటామని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు భారీ ఆయుధాలు, పక్కా వ్యూహాంతోనే దాడికి పాల్పడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. చైనాలో తయారైన AK-47 అసాల్ట్ రైఫిల్స్, మెషిన్ గన్‌లు, ట్యాంక్ నిరోధక గన్‌లు, గ్రెనేడ్‌ల వంటి ఆయుధాలు మయన్మార్‌లోకి అక్రమంగా రవాణ చేస్తున్నారు. ఇవి సరిహద్దు వెంబడి వేర్పాటువాదానికి కూడా దారి తీస్తున్నాయి. రెబల్స్ మెరుపుదాడులు భారత భద్రతా వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. 2018లోనూ మణిపూర్‌లో సైన్యం కాన్వాయ్‌పై ఈ తరహా దాడే జరిగింది. ఈ ఘటనలో ఆర్మీ 6 డోగ్రా రెజిమెంట్‌కు చెందిన 18 మంది సిబ్బంది మరణించారు.
By November 14, 2021 at 11:29AM
No comments