Breaking News

సుప్రీం సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా స్వలింగ సంపర్కుడు


న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడిని సిఫారసు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కిర్పాల్(49)ను న్యాయమూర్తిగా ప్రతిపాదించింది. నవంబరు 11న జరిగిన సమావేశంలో సౌరభ్‌ కృపాల్‌కు న్యాయమూర్తిగా నియమించే సిఫారసును కొలీజియం ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. అయితే, 2017లో సౌరభ్‌ కృపాల్‌ పేరును ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా దీనికి ఆమోదం లభించలేదు. కిర్పాల్‌ స్వలింగ సంపర్క నేపథ్యంతో 2018, 2019లో మూడుసార్లు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైనప్పటికీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయింది. కృపాల్‌ లైంగిక ఇష్టాయిష్టాలపై నిఘా వర్గాల సమాచారం రావడంతో ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె.. కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు వివరణ కోరుతూ లేఖ రాశారు. కిర్పాల్‌ భాగస్వామి స్విస్‌ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న యూరోపియన్‌ కావడంతో అతడి జాతీయతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కాగా, కృపాల్‌ ఆక్స్‌ ఫర్డ్‌, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో నాయ్య శాస్త్రం చదివారు. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాల నుంచి ఆయన న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. విద్యాభ్యాసం తర్వాత భారత్‌కు రావడానికి ముందు ఐరాసలో పనిచేశారు. ఆయన తండ్రి భూపీందర్‌నాథ్‌ కృపాల్‌ 2002 మే నుంచి నవంబరు మధ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. తాజాగా, సుప్రీం సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే మొట్టమొదటి స్వలింగ సంపర్క న్యాయమూర్తిగా చరిత్ర సృష్టిస్తారు. కొలీజియం సిఫార్సుపై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ స్పందించారు. ‘దేశంలోనే హైకోర్టుకు నియమితులు కాబోతున్న తొలి స్వలింగ సంపర్క న్యాయమూర్తి సౌరభ్ కృపాల్‌‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. తాను స్వలింగ సంపర్కుడనని బహిరంగంగా చెప్పుకున్న .. LGBTQ హక్కుల కోసం పోరాటానికి మద్దతు ప్రకటించారు. ‘సెక్స్ అండ్ ది సుప్రీం కోర్ట్' అనే పుస్తకాన్ని కూడా రాశారు.


By November 16, 2021 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-recommends-elevation-of-openly-gay-lawyer-saurabh-kirpal-as-judge-of-delhi-hc/articleshow/87728244.cms

No comments