Breaking News

కిమ్ స్టైల్‌ను కాపీ కొడుతున్న ప్రజలు.. లెదర్ కోట్‌ను నిషేధించిన ఉత్తర కొరియా!


కరోనాకు తోడు ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఉత్తర కొరియాలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఆహార కొరత దృష్ట్యా ఆహారం తక్కువ తినాలని ఇటీవల ప్రభుత్వం హుకుం జారీచేసింది. తాజాగా, ప్రజలు లెదర్‌ కోట్‌ ధరించడాన్ని నిషేధించింది. ప్రజలెవరూ లెదర్‌ కోట్‌ ధరించకూడదని, వస్త్ర వ్యాపారాలు వాటిని విక్రయించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ నిషేధం వెనుక మాత్రం వేరే కారణం ఉంది. డిసెంబరు 2019లో అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఖరీదైన లెదర్‌ కోట్‌ను ధరించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అది విశేషంగా ఆకర్షించడంతో ఉత్తర కొరియాలోని సంపన్నులంతా ఆయనకు మద్దతుగా అలాంటి లెదర్‌ కోటునే ధరించడం మొదలుపెట్టారు. అలా ఆ లెదర్‌ కోట్‌ అధికారులు, సంపన్నుల ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, సామాన్యులు కూడా దానిపై ఆసక్తి ప్రదర్శించడంతో వస్త్ర వ్యాపారులు నాసిరకం లెదర్‌ కోట్స్‌ను దిగుమతి చేసుకొని ప్రజలకు అందుబాటు ధరలో విక్రయిస్తున్నారు. దీంతో వాటిని కొనుగోలు చేసి ఎంచక్కా తమ దేశాధ్యక్షుడు కిమ్‌ వస్త్రధారణను అనుకరిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం లెదర్‌ కోట్‌ ధరించి.. కిమ్‌ను, అధికారుల్ని అవమానిస్తున్నారంటూ వాటిపై నిషేధం విధించారు. ఫ్యాషన్‌ పోలీసులను నియమించి.. కోటు ధరించిన వ్యక్తుల్ని, విక్రయిస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో చైనా సరిహద్దులను తెరవడంతో అనధికారికంగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేవలం లెదర్‌ కోటే కాదు.. బ్లూ జీన్స్‌, స్కర్ట్స్‌, డిజైన్‌ షూస్‌ తదితర ఫ్యాషన్‌ దుస్తులపై అక్కడ నిషేధం కొనసాగుతోంది. పాశ్చాత్యదేశాల ఫ్యాషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కిమ్‌.. తమ దేశ ప్రజలు ఆ పోకడలకు అలవాటు పడకూడదని మొదటినుంచి వీటిపై నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఉన్నతస్థాయి వ్యక్తుల్లా దుస్తులు ధరించడం అనేది అధినేతల అధికారాన్ని సవాల్ చేసే అపవిత్ర ధోరణి అని పోలీసులు పేర్కొన్నారు.


By November 27, 2021 at 07:39AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/north-korea-bans-leather-coats-to-prevent-its-people-from-copying-kim-jong-uns-style/articleshow/87941560.cms

No comments