దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్.. ‘ఒమ్రికాన్’గా పేరు పెట్టిన డబ్ల్యూహెచ్ఓ
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ వ్యాప్తి లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ()ప్రకటించింది. దీన్ని ‘ఆందోళనకర వేరియంట్ (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)’గా వర్గీకరించిన డబ్ల్యూహెచ్ఓ.. ‘ఒమిక్రాన్’ అని పేరును సూచించింది. కొద్దిరోజుల కిందటే ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా గుర్తించిన బి.1.1.529పై చర్చించేందుకు శుక్రవారం ఉన్నతాధికారులు, కోవిడ్ సాంకేతిక బృందం నిపుణులతో డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్‌లు, పరీక్షలు, వ్యాప్తి, తీవ్రత, సమస్యలు, ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓమిక్రాన్‌పై అధ్యయనానికి చాలా వారాలు పడుతుందని తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ రీ-ఇన్‌ఫెక్షన్ ముప్పు ఎక్కువేనని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌ను ‘B.1.1.529’గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, బెల్జియంలో ఈ వేరియంట్ రకం కేసులు వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్సులో ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు స్థానిక వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక్కడ నమోదయిన కేసులకు 90% ఈ వేరియంటే కారణమని తెలిపారు. మరో ఎనిమిది ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్ వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో... ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచం ఉలిక్కిపడుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు కలవరపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతుండగా... నాలుగైదు రోజుల నుంచి ఈ సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్త వేరియంటే ఇందుకు కారణమా? అన్నది మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. తాజాగా మలావి నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ‘బి.1.1.529’ సోకింది. మరో ఇద్దరు కూడా దీనిబారిన పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురూ పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో శాస్త్రవేత్తలు విస్మయం చెందుతున్నారు. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి, కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు ాయన వ్యాఖ్యానించారు.
By November 27, 2021 at 06:53AM
No comments