జడ్జిపై పోక్సో కేసు.. బాలుడికి డ్రగ్స్, మద్యం తాగించి పలుసార్లు లైంగిక దాడి!
ఓ బాలుడ్ని న్యాయమూర్తి లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు రావడం కలకలం రేగుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. భరత్‌పుర్ ప్రత్యేక జడ్జి జితేంద్ర గొలియా తన కుమారుడి (14)పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీబీ కేసులు పరిశీలించే ఈ జడ్జితోపాటు ఆయన సహాయకులు ఇద్దరు తన కుమారుణ్ని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. అంతేకాదు, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కాల్చి చంపుతానని జడ్జి వితంతువునైన తనను బెదిరించినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన రాజస్థాన్ హైకోర్టు.. జడ్జిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించింది. ఈ కేసులో బాధితుడ్ని బెదిరించిన ఏసీబీ అధికారి పరమేశ్వర్‌లాల్ యాదవ్‌ను కూడా సస్పెండ్ చేశారు. అయితే, మైనర్, అతడి కుటుంబం తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని నిందితులు ప్రత్యారోపణలు చేయడం గమనార్హం. మథుర గేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న బాలుడు ఆటలాడుకునేందుకు రోజూ భరత్‌పుర్ టెన్నిస్ కోర్టుకు వెళ్లేవాడు. అక్కడకు వచ్చే స్పెషల్ జడ్జి జితేంద్ర, ఆయన సహాయకులిద్దరితో బాలుడికి పరిచయం ఏర్పడింది. అక్కడ నుంచి బాలుడ్ని తన ఇంటికి తీసుకెళ్లి మద్యం, మత్తుపదార్థాలు ఇచ్చేవారు. స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడేవారని బాలుడి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలుసార్లు ముగ్గురూ కలిసి లైంగికంగా వేధించినట్టు తెలిపారు. కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండటంతో అనుమానించామని, ఏం జరిగిందో చెప్పాలని పదే పదే అడగడంతో చివరకు అక్టోబరు 28న నోరు విప్పాడని వివరించారు. దీంతో తమ కుమారుడ్ని మర్నాడు టెన్నిస్ కోర్టుకు పంపకపోవడంతో తన సహచరులు, ఓ సీనియర్ పోలీస్, ఇతరులను జడ్జ్ మా ఇంటికి పంపారని ఆమె చెప్పారు. తమ కుమారుడ్ని పంపడానికి నిరాకరించడంతో అక్టోబరు 29 రాత్రి జడ్జ్ ఫోన్ చేశాడని, ఏం జరిగిందో మాకు తెలుసని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడంది. తర్వాత రోజు మరో వ్యక్తితో కలిసి తమ ఇంటికి వచ్చిన జడ్జి.. చేసిన పనికి క్షమాపణలు చెప్పారు.. అనంతరం సాయంత్రం ఓ సీనియర్ పోలీస్ అధికారి వచ్చి బెదిరించాడని బాలుడి తల్లి ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు మథుర గేట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు సమయంలో పిల్లల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు గంగారామ్ బాధితులతో ఉన్నారు.
By November 01, 2021 at 08:05AM
No comments