Breaking News

తానా ఆధ్వర్వంలో శ్రీనాథ మహాకవి కవితా వైభవం.. పంచ సహస్రావధాని అద్భుత ప్రసంగం


ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 20 వ “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో ఘనంగా నిర్వహించారు. విదేశాలలో సామాజిక సేవలో తెలుగు కేతనాన్ని రెపరెపలాడిస్తున్న తెలుగు సంతతికి చెందిన న్యూ జెర్సీ రాష్ట్ర యుటిలిటీస్ బోర్డు కమిషనర్ ఉపేంద్ర చివుకుల, కెనడాలోని అల్బర్టా రాష్ట్ర మౌలిక వసతుల శాఖామంత్రి ప్రసాద్ పండాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. వీరిని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహాకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా పరాయి దేశంలో ఉంటూ, అక్కడ జన జీవన స్రవంతిలో మమేకమైనా కూడా తెలుగు భాష మీద పట్టు కోల్పోకుండా తెలుగులో అద్భుతంగా ప్రసంగించిన ఇరువురూ.. మాతృభాషా పరిరక్షణకు అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ఎంతో విలువైన వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సంపదను భావితరానికి భద్రంగా అందించే కృషిలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రాచీన సాహిత్యంపై సదస్సు నిర్వహించడం ముదావహం అన్నారు. శ్రీనాథ మహాకవి కాశీలో స్వయంగా పర్యటించి “కాశీ ఖండం” అనే మహాకావ్యం రచించి 600 ఏళ్లు పూర్తైన సందర్భంగా అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొననారు. ఈ సందర్భంగా శ్రీనాథుని జీవితంలో జరిగిన సంఘటనలు గురించి మాట్లాడారు. శ్రీనాథ మహాకవి సార్వభౌమ కవితా వైభవం, విద్యానగర సంస్థానంలోని ప్రఖ్యాత పండితుడు డిండిమ భట్టును ఓడించడం, ఎన్నెన్నో గొప్ప రచనలు చేయడం, ఎంతోమంది రాజులు, సంస్థానాదీశుల నుంచి లెక్కకు మించిన సన్మానాలు, గండపెండేరాలు, సువర్ణ కంకణాలు అందుకుని కూడా చివరి దశలో అంతా పోగొట్టుకుని సేద్యం చేసి మరింత నష్టాలపాలై ఆర్ధిక బాధలతో కన్నుమూయడం విషాదం అన్నారు. శ్రీనాథ మహాకవి పాండిత్యంపై దాదాపు గంటన్నరకుపైగా సాగిన అవధాని మేడసాని ప్రసంగ ఝరిలో అందరూ తడిసి ముద్దాయ్యారని డాక్టర్ తోటకూర ప్రసాద్ అన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతీక అయిన కుంభావ సరస్వతి, లక్షన్నరకు పైగా పద్యాలను ధారణ చేసిన పంచ సహస్రావధాని డాక్టర్ మోహన్ గారికి తానా ప్రపంచ సాహిత్య వేదిక తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వివిధ ప్రసార మాధ్యమాలకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ కింది యు ట్యూబ్ లింక్ లో చూడవచ్చును.


By November 02, 2021 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/tana-prapancha-sahityavedika-orgnized-event-of-poet-srinatha-kavi-sarvabhowma-vaibhavam/articleshow/87476693.cms

No comments