అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్.. నేడు బాధ్యతలు అప్పగింత!
తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు తాత్కాలికంగా బదిలీ చేయనున్నారు. అధ్యక్షుడు బైడెన్కు వైద్య పరీక్షల నేపథ్యంలో.. తన బాధ్యతలను బైడెన్ తాత్కాలికంగా కమలాకు అప్పగించనున్నారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆయనకు అనస్థీషియా ఇస్తారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను బైడెన్ చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారి. అందువల్ల ఆ సమయంలో కమలా హ్యారిస్కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్టు వైట్‌హౌస్ వెల్లడించింది. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగానూ కమలా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.‘రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి అధ్యక్షుడు బైడెన్ అనస్థీసియాలో ఉన్న కొద్ది కాలం పాటు ఉపాధ్యక్షురాలికి అధికారాన్ని బదిలీ చేస్తారు’ అని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి జెన్ సాకీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక గంట 25 నిమిషాల పాటు కమలా అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.10 గంటలకు అధికారాలను బదిలీ చేయనున్నట్టు వైట్‌హౌస్ తెలిపింది. ‘ఉదయం 10.10 గంటల నుంచి 11.35 గంటల వరకు అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్ నిర్వహిస్తారు’ అని పేర్కొంటూ కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖను పంపింది. జో బైడెన్ తిరిగి ఉదయం 11.35 గంటలకు బాధ్యతలను చేపడతారని ఆ లేఖలో పేర్కొంది. ఇదే తరహాలో.. మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు. జో బైడెన్ ఈ శనివారం 79వ ఏట అడుగుపెట్టనున్నారు.
By November 20, 2021 at 07:02AM
No comments