Breaking News

చైనా అణుదాడి తప్పదు.. అమెరికా సైనిక ఉన్నతాధికారి హెచ్చరికలు


అమెరికా, చైనాల మధ్య గత కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్రం, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలపై ఇరు దేశాలు బహిరంగంగానే పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. అవసరమైతే అమెరికాతో ప్రత్యక్ష దాడికి కూడా చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తోంది. కొద్ది నెలల కిందట ఓ రహస్య క్షిపణి ప్రయోగాన్ని కూడా చేపట్టింది. ఈ పరిణామాలతో అమెరికాపై దాడికి చైనా సమాయత్తమవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, అమెరికా సైన్యానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏదో ఒక రోజు అమెరికాపై డ్రాగన్‌ అనూహ్య అణు దాడికి పాల్పడవచ్చని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్-ఛైర్మన్ జనరల్ జానీ హేటెన్ హెచ్చరించారు. జులైలో చైనా పరీక్షించిన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణి భూ కక్ష్యలో పయనిస్తూ మొత్తం భూమిని చుట్టేసి.. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం దిశగా ప్రయాణించింది. కొద్దిలో లక్ష్యం గురితప్పినా.. ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో చైనా చాలా వరకూ విజయవంతమయ్యింది. అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ ప్రయోగం ఇటీవలే బయటపడగా.. దీనిపై జానీ హేటెన్‌ మరిన్ని వివరాలను సేకరించారు. ‘‘గత ఐదేళ్లలో చైనా వందల సంఖ్యలో హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించింది.. అమెరికా మాత్రం కేవలం 9 ప్రయోగాలే చేపట్టింది. ఇప్పటికే చైనా వద్ద మీడియం రేంజ్‌ హైపర్‌సోనిక్‌ ఆయుధం ఉంది.. జులైలో ప్రయోగించిన క్షిపణి సుదీర్ఘ లక్ష్యాలను చేధించగలదు.. వందలాది క్షిపణులను తయారు చేసుకుంటున్న చైనా.. ఏదో ఒక రోజు అమెరికాపై అనూహ్య అణ్వాయుధ దాడికి పాల్పడే అవకాశం ఉంది’’ అని హేటెన్‌ హెచ్చరించారు. ఇటీవల పెంటగాన్‌ కూడా ఇటువంటి హెచ్చరికలే చేసింది. డ్రాగన్‌ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శరవేగంగా పెంచుకుంటోందని, ఈ దశాబ్దం చివరి నాటికి ఆ దేశం వద్ద 1000 న్లూక్లియర్‌ వార్‌హెడ్‌లు ఉండొచ్చని అంచనా వేసింది. హైపర్‌సోనిక్ ఆయుధాలు ధ్వని కంటే కనీసం ఐదు రెట్లు వేగంతో (గంటకు 6,200 కిలోమీటర్లు) ప్రయాణిస్తాయి. ఇటువంటి క్షిపణినే చైనా ఇటీవల ప్రయోగించింది. భూమి చుట్టూ ఓ క్షిపణి ప్రయాణించడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించిన చైనా.. అది క్షిపణి కాదని, వ్యోమనౌక అని వెల్లడించడం గమనార్హం. కాగా, అమెరికా, చైనా దేశాధినేతల మధ్య వర్చువల్‌గా సమావేశం జరిగిన మర్నాడే హైటెన్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బైడెన్, జిన్‌పింగ్ భేటీలో హైపర్‌సోనిక్ క్షిపణి అంశం చర్చకు వచ్చిందా? అనేది స్పష్టత లేదు. అణ్వాయుధాలను ఉపయోగించే విధానంలో తాము తొలుత వినియోగించమని 1964 నుంచి ప్రతిజ్ఞ చేసింది.


By November 20, 2021 at 12:48PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-top-general-john-hayten-warns-china-could-soon-spring-surprise-nuclear-strike-on-us/articleshow/87814351.cms

No comments