లక్నోలో డీజీపీల కాన్ఫరెన్స్.. హాజరుకానున్న ప్రధాని, అమిత్ షా, అజిత్ దోవల్
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో రెండు రోజులపాటు జరిగే 56వ డీజీపీలు, ఐజీపీలస్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి , జాతీయ భద్రతా సలహాదారు పాల్గొననున్నారు. హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, పారా మిలటరీ దళాలు, కేంద్ర పోలీస్ విభాగాలకు చెందిన అధిపతులు నేరుగా పాల్గొంటారు. అలాగే, ఐబీ లేదా ఎస్ఐబీ ప్రధాన కార్యాలయాలు దేశవ్యాప్తంగా 37 వేర్వేరు ప్రాంతాల నుంచి వర్చువల్‌గా హాజరవుతారు. సైబర్ నేరాలు, డేటా గవర్నెన్స్, ఉగ్రవాదంపై పోరాటంలో సవాళ్లు, వామపక్ష తీవ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా తదితర అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీజీపీల సదస్సుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇంతకు ముందు లాంఛనప్రాయంగా జరిగేదానికి భిన్నంగా సదస్సులోని అన్ని సెషన్‌లకు హాజరుకావాలని ప్రధాని సూచించారు. దేశాన్ని ప్రభావితం చేసే కీలక పోలీసింగ్, అంతర్గత భద్రతా సమస్యలపై నేరుగా ప్రధానికి వివరించేలా ఉన్నత పోలీసు అధికారులకు ఈ సమావేశం అవకాశం కల్పిస్తోంది. రాజధాని ఢిల్లీలో సంప్రదాయంగా నిర్వహించే ఈ వార్షిక సమావేశాలను 2014 నుంచి వేర్వేరు నగరాలను వేదికలుగా చేసుకుంటున్నారు. గతేడాది కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరగడం మినహా ఢిల్లీ వెలుపల నిర్వహిస్తున్నారు. 2014లో గౌహతి, 2015లో గుజరాత్ రాన్ ఆఫ్ కచ్‌లోని ధోర్డో, 2016లో హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ, 2017లో టెంకాపూర్ బీఎస్ఎఫ్ అకాడమీ, 2018లో కెవాడియా (గుజరాత్), 2019లో పుణేలోని ఐఐఎస్ఆర్‌లు ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చాయి.
By November 20, 2021 at 10:44AM
No comments