Maharashtra డిప్యూటీ సీఎంకి షాక్.. రూ.1,000 కోట్ల ఆస్తులను జప్తుచేసిన ఐటీ
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌కు ఆదాయపు పన్ను శాఖ భారీ షాకిచ్చింది. అజిత్ పవార్‌కు చెందిన రూ.1,000 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్ సహా ఐదు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత నెలలో అజిత్ పవార్ సోదరిల నివాసాలు, సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఐటీ దాడులపై అజిత్ పవార్ స్పందిస్తూ.. తమ సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్నులను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని అన్నారు. ‘ఏటా నిబంధనలు ప్రకారం పన్నులు చెల్లిస్తున్నాం.. నేను ఆర్ధిక శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తున్నాం.. నాకు సంబంధించిన అన్ని సంస్థలు పన్నులు చెల్లించాయి’ అని తెలిపారు. ఇదే సమయంలో ఐటీ శాఖ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ‘దాదాపు 35- 40 ఏళ్ల కిందట వివాహమై నా సోదరీమణుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడం పట్ల నేను కలత చెందాను.. అజిత్ పవార్ బంధువులు అని వారిపై దాడి జరిగిందంటే.. అధికారి దుర్వినియోగంతో ఏజన్సీలను రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న తీరు గురించి ప్రజలు ఆలోచించాలి’ అని పవార్ అన్నారు. ఇక, మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసింది. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఆయనను సోమవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
By November 02, 2021 at 12:30PM
No comments