Breaking News

వాయుగుండంగా అల్పపీడనం.. చెన్నైకి పొంచి ఉన్న మరో వానగండం


దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది గురువారం సాయంత్రానికి తుఫానుగా తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర తమిళనాడులోని కరైకల్, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట, పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. రువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఇక, అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులోని ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షాలు కురిశాయి. చెన్నై సమీపంలోని చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం, విల్లుపురంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఇక, నాగపట్టణం, తిరుప్పూండి ప్రాంతాల్లో అత్యధికంగా 31 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కరైకల్‌లో 29, వేదారణ్యం 25 సెం.మీ. వంతున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరువారూర్‌, తంజావూర్‌, మన్నార్‌గుడి, మైలాడుదురై, పట్టుకోట్టై సహా ఇతర డెల్టా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర చెన్నై, తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని 8 జిల్లాలకు గురువారం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చెన్నై కేకే నగర్‌లో వర్షపునీరు ఇంకా నిలిచి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొళత్తూర్‌ నియోజకవర్గంలోని జీకేఎం కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. చెన్నై పురసైవాక్కం సమీపంలోని పట్టాలం ప్రాంతంలో నడుములోతు వరద నీరు చేరడంతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తరమణిలోనూ ప్రజలకు అవస్థలు తప్పలేదు. చెన్నై టీనగర్‌, పెరంబూర్‌ సహా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాపై ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి.


By November 11, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/depression-over-bay-of-bengal-likely-to-cross-tamil-nadu-coast-today-evening/articleshow/87638218.cms

No comments