Bihar ఉసురుతీసిన కల్తీమద్యం.. 24 మంది మృతి
బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉండటంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అక్కడ ఏరులై పారుతోంది. దీనిని తాగి పలువురు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా, వ్యాప్తంగా కల్తీ మద్యం తాగి రెండు రోజుల్లో 24 మంది మృతిచెందారు. గోపాల్‌గంజ్ జిల్లాలోని కుషాహర్, మహ్మద్‌పూర్‌లో 16 మంది, పశ్చిమ చంపారన్ జిల్లాలో 8 మంది కల్తీ కల్లుకు బలయ్యారు. మరో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. గతనెలలో ముజఫర్‌పూర్‌లో కల్తీమద్యం తాగి 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గురువారం పశ్చిమ చంపారన్ జిల్లా కేంద్రం బెట్టాయ్ సమీపంలోని తెల్హు గ్రామంలో ఎనిమిది మంది చనిపోగా.. గోపాల్‌గంజ్ జిల్లాలో రెండు రోజుల్లో 16 మంది మృతిచెందారు. గత పది రోజుల్లో తెల్హూలో జరిగిన మూడో ఘటన ఇది. ఈ ఘటనపై స్పందించిన బిహార్ ప్రభుత్వం.. గోపాల్‌గంజ్‌కు హుటాహుటిన మంత్రి జానక్ రామ్‌ను పంపింది. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలను మంత్రి జానక్ రామ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరిగిన కుట్రని ఆరోపించారు. ప్రాథమికంగా ఈ మరణాలు కొన్ని విషపూరిత పదార్థాలను సేవించడం వల్లే సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం నుంచి బుధవారం మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు కల్తీ మద్యం మృతుల్లో ఎక్కువ మంది షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులే ఉన్నారు. స్థానిక వ్యాపారుల నుంచి వీరు మద్యం కొనుగోలు చేసి సేవించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కల్తీమద్యం సేవించి బిహార్‌లో దాదాపు 100 మంది ప్రాణాలను పోగొట్టుకోవడం గమనార్హం. ఏటా కల్తీమద్యం మరణాలు ఆ రాష్ట్రంలో తరుచూ చోటుచేసుకుంటున్నాయి. నితీశ్ కుమార్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేసి వాగ్దానం నిలుపుకున్నారు. కానీ, నిషేధం ఆశించిన స్థాయిలో అమలుజరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.
By November 05, 2021 at 10:13AM
No comments