Breaking News

Ayodhya పుస్తకంపై రగడ.. కాంగ్రెస్ సీనియర్ నేత నివాసానికి నిప్పు


అయోధ్యపై రాసిన పుస్తకంలో హిందూత్వను ఇస్లామిక్‌ తీవ్రవాదంతో పోల్చి సీనియర్ నేత వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలూ వెల్లువెత్తుతుండగా.. సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌లోని ఆయన నివాసాన్ని కొంతమంది ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ విషయాన్ని సల్మాన్ ఖుర్షీద్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేశారు. ఇంటిలో మంటల దృశ్యాలు, అగ్నికి ఆహుతువున్న తలుపులు, పగిలిన కిటికీల అద్దాల ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో ఉంచారు. నీటితో మంటలను ఆర్పడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టు ఓ వీడియోలో ఉంది.‘ఈ ఘటనకు ఎవరైతే పాల్పడ్డారో.. అలాంటి స్నేహితులతో చర్చల కోసం ఈ ఇంటి తలుపులు తెరవాలని ఆశించా.. ఇది హిందూయిజం కాదని నేను చెప్పింది తప్పంటారా?.. కాబట్టి ఇప్పుడు ఇదే అంశంపై చర్చ.. సిగ్గు అనేది చాలా పనికిమాలిన పదం.. అంతే కాదు ఏకీభవించడం నుంచి వ్యతిరేకించడం మాట పక్కనబెడితే కూర్చుని మాట్లాడుకుంటామని ఇప్పటికీ ఆశిస్తున్నాను’ ’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ‘ఇది అవమానకరం.. అంతర్జాతీయ వేదికలపై భారత్ గర్వపడేలా చేసిన రాజనీతిజ్ఞుడు.. ఎల్లప్పుడూ మితవాద, మధ్యమవాద, సమగ్ర దృష్టిని ఆయన వ్యక్తీకరించారు.. ఇది మన రాజకీయాలలో పెరుగుతున్న అసహనం స్థాయిలను అధికారంలో ఉన్నవారు ఖండించాలి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం దీనిని తీవ్రంగా ఖండించారు. ‘సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇటువంటి మూర్ఖులు పుస్తకంలో ఏముందో తెలుసుకోలేరు’ అని అన్నారు. ఖుర్షీద్‌ ఇంటిపై దాడి వ్యవహారంపై కుమావన్ డీఐజీ నీలేష్ ఆనంద్‌ వివరణ ఇస్తూ.. ఈ ఘటనలో రాకేశ్ కపిల్ అనే వ్యక్తి సహా 20 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయోధ్యపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన ‘సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ పుస్తకంలో ‘సనాతన ధర్మం, శాస్త్రీయ హిందుత్వాలను కరుడుగట్టిన హిందూయిజం ఓ మూలకు నెట్టివేసింది.. హిందూయిజంలోని మరో పార్శ్వం ఇదే.. ఇది రాజకీయ హిందుత్వం.. ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఐసిస్, బోకో హరామ్ వంటి ఇస్లామిక్ జిహాదీ గ్రూపులకు.. దీనికి తేడా లేదనిపిస్తోంది’ అంటూ ఖుర్షీద్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దీంతో నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


By November 16, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ayodhya-book-controversy-congress-leader-salman-khurshid-home-set-on-fire/articleshow/87727855.cms

No comments