Breaking News

అరుణాచల్‌లో చైనా గ్రామం 60 ఏళ్ల కిందటే నిర్మాణం.. ఆర్మీ సంచలన ప్రకటన!


అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న వివాదాస్పద ప్రాంతంలో కొత్తగా చైనా ఓ గ్రామాన్ని సృష్టించడం కలకలం రేగుతోంది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తమ వార్షిక నివేదికలో భారత్ సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఏకంగా చైనా 100 నివాసాలతో ఓ గ్రామాన్ని నిర్మించిందని వెల్లడించింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఇది చర్చనీయంగా మారింది. మన భూభాగంలో చైనా ఇంత పెద్ద గ్రామం నిర్మిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెంటగాన్ నివేదికను అధ్యయనం చేసిన భారత ఆర్మీ వర్గాలు తాజాగా ఈ వివాదంపై స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి ఆ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లో లేదని, చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న వివాదాస్పద ప్రాంతంలో మాత్రమే ఉందని ఆర్మీ వర్గాలు వివరణ ఇచ్చాయి. అంతేకాదు, ఈ గ్రామం నిర్మాణం ఆరు దశాబ్దాల కిందటే మొదలైందని పేర్కొన్నాయి. 1959లో భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో నిర్మించిందని స్పష్టతనిచ్చాయి. అసోం రైఫిల్స్‌తో పోరులో విజయం సాధించిన తర్వాత దీన్ని చైనా నిర్మించినట్లు తెలుస్తోంది. భారత్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని అక్రమించిన చైనా అక్కడ తమ రక్షణ అవసరాల కోసం గ్రామాన్ని నిర్మించినట్లు అధికారులు చెప్తున్నారు. అరుణాచల్‌లో ఇంత తక్కువ సమయంలో చైనా అంత పెద్ద గ్రామం నిర్మించే పరిస్ధితులు ప్రస్తుతం లేవని భద్రతాదళ అధికారులు వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల పరిధిలో చైనా 628 జియాకాంగ్ మోడల్ రక్షణ గ్రామాలను అనేకం నిర్మించిందని, ఇవన్నీ వారి భూభాగంలోనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, మాత్రం.. ‘2020లో PRC (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఎల్ఏసీ తూర్పు సెక్టార్‌లో టిబెట్ అటానమస్ రీజియన్, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మధ్య వివాదాస్పద భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించింది’ అని పేర్కొంది. 1962 యుద్ధానికి ముందు భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ఎగువ సుబాన్సిరీ జిల్లాలోని సరీ చౌ నదీతీరంలో ఈ గ్రామాన్ని సృష్టించింది. ‘దీంతో పాటు చైనా ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రయత్నాలు భారత ప్రభుత్వం, మీడియా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి’ అని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా, ఈ ప్రాంతంలో చైనా దశాబ్దానికిపైగా చిన్న సైనిక ఔట్‌పోస్ట్‌ను కొనసాగించింది. అయితే, 2010 నుంచి పరిస్థితిలో వేగంగా మార్పు చోటుచేసుకుంది. భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి రహదారి నిర్మాణాలు, గ్రామాన్ని ఏర్పాటుచేస్తోంది. ‘సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య, సైనిక సంభాషణలు, చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఎల్ఏసీ వద్ద PRC వ్యూహాత్మక చర్యలను కొనసాగిస్తోంది’ అని పెంటగాన్ నివేదిక పేర్కొంది.


By November 10, 2021 at 06:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/army-officials-clarifies-village-under-chinas-adverse-occupation-since-1959/articleshow/87616954.cms

No comments