Breaking News

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.. బాలికపై 6నెలల్లో 400 మంది అత్యాచారం


ఎన్ని చట్టాలు తెచ్చినా.. కామాంధులకు కఠిన శిక్షలు విధించినా దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధుల వరకు ఎవరినా వదలడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోతున్న కామాంధులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఈ కోవలోనే దిక్కుతోచని స్థితిలో ఉపాధి కోసం వెళ్లిన ఓ బాలికను కామాంధులు కాటేశారు. ఆరు నెలలుగా ఆమెపై ఏకంగా 400 మంది అత్యాచారానికి ఒడిగట్టడంతో బాధితురాలు గర్భం దాల్చింది. నిందితుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. న్యూస్‌ 18 లోక్‌మాత్‌ (మరాఠి)లో ప్రచురించిన కథనం మేరకు... బీడ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లి రెండేళ్ల క్రితం మృతిచెందింది. అనంతరం తండ్రి ఆమెను ఓ వ్యక్తికిచ్చి వివాహం చేశారు. అయితే మామ(భర్త తండ్రి) లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని ఆ బాలిక ఏడాది తర్వాత పుట్టింటికి వచ్చేసింది. కొద్దిరోజులు ఇంట్లో ఉన్న తర్వాత ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అంబేజోగై పట్టణానికి చేరుకుంది. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెకు సాయం చేయాల్సింది పోయి చాలామంది ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం రెండు నెలల గర్భవతిగా ఉన్న బాలిక పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. ఆరు నెలలుగా సుమారు 400 మందికి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, అందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు చెబుతున్న వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాధితురాలు తన పిండాన్ని తొలగించుకునేందుకు అనుమతి కావాలని కోరడంతో పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాలిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధీనంలోనే ఉంది.


By November 15, 2021 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/maharashtra-minor-girl-allegedly-raped-by-400-people-including-cop-over-6-months/articleshow/87707248.cms

No comments