PrakashRaj - MAA: ‘మా’లో మరో ట్విస్ట్.. సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్‌కు తాళం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) ఎన్నికలు ముగిశాయి. ప్యానెల్ గెలిచింది. అధ్యక్షుడిగా విష్ణు మంచు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారందరూ ఒకేసారి రాజీనామా చేశారు. అంత వరకు బాగానే ఉంది. అయితే రీసెంట్‌గా ప్రకాశ్ రాజ్, ఎన్నికల్లో విష్ణు మంచు ప్యానెల్‌కు సంబంధించి మోహన్‌బాబు, నరేశ్ వర్గం తమపై దాడి చేసిందని ఆరోపణలు చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యిందని, ఆ సీసీ ఫుటేజ్ తమకు కావాలని కోరుతూ ఎన్నికల అధికారిక లేఖ రాశారు. ఈ వ్యవహారంపై ఆదివారం ‘మా’ ఆఫీసులో పెద్ద డ్రామానే నడిచింది. సీసీఫుటేజ్ ఉన్న సర్వర్ రూమ్‌కు పోలీసులు తాళం వేశారు. అంటే మా ఎన్నికల వ్యవహారం ఇప్పుడు పోలీసుల పరిధి వరకు వెళ్లిందన్నమాట. ఎన్నికల సమయంలో తాము నిష్పక్షపాతంగా వ్యవహరించామని చెబుతూ వస్తున్న ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మరి ప్రకాశ్ రాజ్ అడిగినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను ఇస్తారో లేదో చూడాలి. అధ్యక్ష పదవి ప్రమాణ సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాల గురించి విష్ణు ప్రస్తావించారు. రాజీనామాలు చేయడం దురదృష్టకరమని చెప్పిన విష్ణు, తమ ప్యానెల్ ముందుకు వెళుతుందని, రెండు సంవత్సరాల్లో తానేంటో రుజువు చేసుకుంటానని తెలిపారు విష్ణు. మరో వైపు మోహన్ బాబు మాట్లాడుతూ అనవసరంగా రెచ్చగొట్టొద్దని, మీడియా ముందుకు వెళ్లొద్దని ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు వార్నింగ్ ఇచ్చారు.
By October 17, 2021 at 12:24PM
No comments