Mamata Banerjee నేడే భవానీపూర్ ఉప-ఎన్నిక ఫలితం.. మమత గెలుపుపై ఉత్కంఠ
దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ్ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప-ఎన్నిక ఫలితం నేడు వెల్లడికానుంది. భవానీపూర్ నుంచి బెంగాల్ సీఎం బరిలో నిలవడంతో ఫలితంపై ఆసక్తి నెలకుంది. ఈ ఏడాది మార్చి- ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ్ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించినా.. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఉప-ఎన్నికల్లో దీదీ తప్పక గెలవాల్సి పరిస్థితి నెలకుంది. భవానీపూర్‌లో గెలిస్తేనే ఆమె సీఎం పదవిలో కొనసాగుతారు. లేకపోతే, రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. అయితే, తమ అధినేత్రి 50వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ, మమతా బెనర్జీకి ప్రత్యర్ధిగా బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీచేశారు. ఆమె మమతకు గట్టిపోటీనే ఇచ్చారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. భవానీపూర్‌లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 21 రౌండ్లలో ఓట్లను లెక్కించనుండగా.. మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. మొత్తం 24 కంపెనీల బలగాలను మోహరించారు. సెప్టెంబరు 30న జరిగిన పోలింగ్‌లో 57 శాతం ఓటింగ్ నమోదయినట్టు ఈసీ వెల్లడించింది. గతంలో భవానీపూర్ నుంచి మమతా 2011, 2016 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆమె సొంత నియోజవర్గం కావడంతో గెలుపు నల్లెరుపై నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, కలకత్తా హైకోర్టు న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ సైతం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. బెంగాల్‌లో భవానీపూర్ సహా మరో రెండు స్థానాలకు ఉప-ఎన్నికలు జరిగాయి. ముర్షీదాబాద్ జిల్లాలోని సంసేర్‌గంజ్, జంగీపూర్ స్థానాలకు సెప్టెంబరు 30న పోలింగ్ జరిగింది. అత్యధికంగా సంసేర్‌గంజ్‌లో 79.92 శాతం, తర్వాత జంగీపూర్‌లో 77.63 శాతం, భవానీపూర్‌లో 57 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
By October 03, 2021 at 07:44AM
No comments