Breaking News

mahatma gandhi అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లకు పడమర దారి చూపించిన గొప్పనేత


ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ. ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు, వాటిని ఉపయోగించడానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. చేత కర్రబట్టి రవిఅస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించినా, మగ్గం చేతబట్టి నూలు వడికినా, చీపురు అందుకొని మురికివాడలు శుభ్రం చేసినా.. అదే ఒడుపూ, అంతే శ్రద్ధ. ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చి.. తెల్ల దొరలకు పడమర దారి చూపించారు. ఇరవయ్యో శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరసలో నిలుస్తారు . భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణం. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు. శనివారం (అక్టోబర్ 2) గాంధీజీ 152వ జయంతి. గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్థానంలో ఒక దివాన్‌గా పని చేసేవారు. తల్లి హిందూ సంప్రదాయాలను పాటించే వ్యక్తి. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘My Experiments With Truth’లో స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఇదొకటి. చిననాటి మోహన్‌దాస్ తరగతి గదిలో ఎక్కువ బిడియ పడుతూ వెనుక వరసలో కూర్చొనే వారట. గాంధీజీ ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియవాడ్‌లో పూర్తి చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా వెళ్లారు. తెల్లవారిపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు అక్కడే మొదలుపెట్టారు. దేశాన్నంతటినీ ఏకదాటిపైకి తెచ్చి స్వాతంత్య్రం సంపాదించి పెట్టడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. దేశంపై చెరగని ముద్ర వేశారు. జాతిపిత అయ్యారు. అలాంటి మహాత్ముడు 1948 జనవరి 30న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా ఆయణ్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. విశ్వాన్ని ప్రభావితం చేసిన ఓ మహా ప్రాణం.. ‘హే రామ్’ అంటూ అలా అనంత వాయువుల్లో కలిసిపోయింది. స్వాతంత్య్రోద్యమం నడిచిన కాలంలో గాంధీజీ పుట్టిన రోజులు చాలానే వచ్చాయి. కానీ జీవితంలో ఒక్కసారి తప్పిస్తే ఎన్నడూ ఆయన ఈ వేడుకను జరుపుకోలేదు. అదీ ఓ మంచి ఉద్దేశంతో నిర్వహించడం వల్ల ఆయన అంగీకరించారు. అది మహాత్ముడి 75వ పుట్టినరోజు. 1944 ఫిబ్రవరిలో మరణించిన గాంధీజీ భార్య కస్తూర్బా సంస్మరణార్థం ఏర్పాటైన జాతీయ ట్రస్టుకు నిధుల సేకరణకు సభ్యులంతా బతిమిలాడితే గాంధీజీ ఒప్పుకున్నారు. ఈ ట్రస్టు ఏర్పాటు సమయంలో గాంధీ జైలులో ఉన్నారు. సుమారు రూ.75 లక్షల సేకరించాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. అంతమొత్తం సేకరించటం కష్టమనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా రూ.కోటిపైనే సమకూరింది. 1944 అక్టోబరు 2న వార్దా సేవాశ్రమంలో కార్యక్రమం ఏర్పాటుచేసి... కస్తూర్బా ట్రస్టు సొమ్మును ఆయనకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జమ్నాలాల్‌ బజాజ్‌ కుమార్తె మదాలస ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూశారు. సేవాశ్రమాన్ని అందంగా అలంకరించారు. చుట్టూ దీపాలు వెలిగించారు. ఇది తెలిసిన గాంధీజీ వెంటనే మదాలసను పిలిచి మందలించారు. ‘ఒకవంక వేల గ్రామాల్లో తినడానికి తిండి లేదు... వారి జీవితాల్లో వెలుగుల్లేవు. నువ్వేమో ఇక్కడ దీపాల రూపంలో నూనె వృథా చేస్తున్నావా?’ అంటూ ఆర్భాటం అంతా తీయించేశారు. ఇక, 1947, అక్టోబరు 2 స్వతంత్ర భారతంలో గాంధీజీ తొలి, ఆఖరు (78వ) పుట్టినరోజు. ఢిల్లీలో జరిగిన ప్రార్థన సమావేశంలో మహాత్ముడు ఉద్వేగంతో మాట్లాడుతూ..‘ ఉపవాసం... నూలు వడకటం...ప్రార్థన... పుట్టినరోజు జరుపుకొనే సరైన పద్ధతి ఇదేనన్నది నా భావన.. మీ అందరికీ ఇవాళ నా పుట్టినరోజు. నాకు మాత్రం సంతాప దినం! ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యంగానూ, సిగ్గుగానూ ఉంది. ఇన్నాళ్లూ లక్షల మంది నా మాట మీద నడిచారు.. ఇవాళ ఒక్కరూ నా మాట వినటం లేదు. నిజంగా నా పుట్టిన రోజు సంబరంగా చేసుకోవాలనే మీకుంటే... మనసుల్లోంచి విద్వేషభావాన్ని తొలగించుకోండి. అది మీ బాధ్యత!’ అన్నారు.


By October 02, 2021 at 06:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/important-and-history-of-mahatma-gandhi-birth-anniversary-key-role-indian-freedom-movement-in-telugu/articleshow/86698049.cms

No comments