Breaking News

Kashmir నౌషేరా సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలి ఇద్దరు సైనికులు మృతి


జమ్మూ కశ్మీర్‌లో శనివారం సాయంత్రం ల్యాండ్‌మైన్ పేలి ఇద్దరు సైనికులు మృత్యువాత పడగా, మరో ముగ్గురు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంబడి నౌషేరా-సుందర్బన్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఎల్ఓసీ వద్ద సైనికులు పహారా కాస్తుండగా ఈ ఘటన జరిగిందని, ఓ అధికారి సహా ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నాయి. గాయపడిన ముగ్గురు సైనికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వివరించాయి. ‘ఇద్దరు సైనికులు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు’ అని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. నౌషేరా సెక్టార్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ల్యాండ్‌మైన్ పేలింది.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. గాయపడిన మరో జవాన్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది’ అని జమ్మూ రీజియన్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ‘లెఫ్టినెంట్ రిషికుమార్, జవాన్ మంజీత్‌లు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు.. లెఫ్టినెంట్ రిషికుమార్ స్వస్థలం బిహార్‌లోని బెగుసరాయ్ కాగా, సిపాయ్ మంజీత్ సింగ్ పంజాబ్ భటిండా జిల్లా సిర్వెవలా.. వీరి త్యాగాలను , యావత్తు దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి..’ అని అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మూలోని పీర్‌పంజాల్ ప్రాంతంలోని రాజౌరీ జిల్లా పరిధిలోకి వస్తుంది. గత మూడు వారాలుగా అక్కడ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదులతో దాదాపు మూడు వారాల నుంచి కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇద్దరు అధికారులు సహా 9 మంది సైనికులు అమరులయ్యారు. పూంచ్ అడవుల్లో పశువుల కాపర్లు ఏర్పాటుచేసుకున్న తాత్కాలిక నివాసాల్లో ముష్కరులు ఆశ్రయం పొందుతున్నట్టు సైనికులు అనుమానిస్తున్నారు. గడిచిన 18 ఏళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన సుదీర్ఘ ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం.


By October 31, 2021 at 06:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-soldiers-killed-in-naushera-of-kashmir-landmine-blast-close-to-line-of-control/articleshow/87414319.cms

No comments