Breaking News

‘రేషన్ కార్డు ఉన్నవాళ్లంతా పేదలేనా.. ఉచితాలతో మేలు జరగదు’.. వెంకయ్య సంచలన వ్యాఖ్యలు


జనాకర్షక పథకాలపై ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సమీపంలోని ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఐవీ సుబ్బారావు రైతునేస్తం పురస్కారాలు-2021’ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఉచిత పథకాలతో ప్రజలకు మేలు జరగదని, నా యాభై ఏళ్ల ప్రజాజీవితంలో ఇదే గమనించాను అని అన్నారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వాల పథకాలు ఉండాలని సూచించారు. జనాకర్షక పథకాలపై దృష్టి పెట్టి.. ఉన్న డబ్బును ఎక్కువగా వాటికి ఖర్చుపెడితే సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ‘ఉచితాలు, తాత్కాలిక జనాకర్షక పథకాలతో ప్రజలకు మేలు కలగదని 50 ఏళ్ల ప్రజాజీవితంలో నేను గమనించాను.. ఇబ్బందిగా ఉన్నవారికి ఆహారం అందజేయాలి. ఉచితంగా బియ్యం ఇవ్వాలి.. అందులో అనుమానం లేదు. కానీ దేశంలో రేషన్‌ కార్డులు ఉన్నవారంతా పేదవాళ్లేనా? అనేది మనమంతా ఆలోచించుకోవాలి.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా వారికి చేయూతనందించేలా పథకాలు చేపట్టాలి’ అని సూచించారు. ‘నా లెక్కలో రైతుకు కావాల్సింది ఉచిత విద్యుత్తు కాదు.. 10-12 గంటల నాణ్యమైన, నిరాటంకమైన విద్యుత్తు.. ఇలా చెబితే రైతులు బాధపడతారని కొందరు అంటున్నారు. నేనూ రైతుబిడ్డనే.. రైతు తన ఉత్పత్తులను పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకోడానికి.. అక్కడి వారు పల్లెలకు వచ్చి కొనుక్కోడానికి రవాణా సౌకర్యాలు కల్పించాలి.. కోల్డ్ స్టోరేజీలు, శీతల వాహనాలు అందుబాటులోకి తేవాలి.. ఇవీ రైతు అనుకూల చర్యలంటే’ అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న క్రమంలో రైతులకు చేయూత అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.. వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి.. సాయం కూడా ఎక్కువగా ఉండాలి’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘కోవిడ్‌-19 ప్రమాదం ఇంకా పొంచి ఉంది.. రష్యా సహా పలుదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.. కరోనా సమయంలో అన్ని రంగాలూ ఆటుపోట్లకు గురైనా.. రైతులు తమ అకుంఠిత దీక్షతో వ్యవసాయ ఉత్పత్తిని పెంచారు. వారికి జేజేలు.. వ్యవసాయరంగ అభివృద్ధికి అన్నదాత సహా వివిధ పత్రికలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. పత్రికలూ కొంతభాగాన్ని వ్యవసాయానికి కేటాయిస్తున్నాయి.. ఇంకా ఎక్కువగా కేటాయించాలి’ అని సూచించారు. ‘మన నాటుకోడి పులుసు, రాగి సంగటి ముందు మరేదీ సాటిరాదు..’ అన్నారు.


By October 31, 2021 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vice-president-venkaiah-naidu-on-free-welfare-schemes-in-india/articleshow/87415630.cms

No comments