Breaking News

Kashmir 48 గంటల ఆపరేషన్.. గల్లంతైన జవాన్ల మృతదేహాలు లభ్యం.. 9కి చేరిన మృతులు


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో) , మరో సైనికుడి మృతదేహాలను సైన్యం గుర్తించింది. 48 గంటల భారీ ఆపరేషన్ అనంతరం ఇద్దరు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇటీవల కాలంలో ఒక ఎన్‌కౌంటర్‌లో ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. పూంఛ్ జిల్లా రాజౌరీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొలుత ఐదుగురు సైనికులు చనిపోగా.. నాలుగు రోజుల తర్వాత అక్కడే మరో ఇద్దరు సైనికులు యోంగాంబర్ సింగ్, విక్రమ్ సింగ్ నేగి ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులయ్యారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో గల్లంతైన ఇద్దరు సైనికుల ఆచూకీ శనివారం లభించింది. మెంధార్‌లోని నార్ ఖాస్ అటవీ ప్రాంతంలో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడి.. సాధారణ పౌరుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, శనివారం మరోసారి సామాన్యులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరో ఇద్దరు పౌరుల ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్‌లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ కార్పెంటర్‌ని కాల్చి చంపారు. గతవారం ఏడుగురు పౌరులను పొట్టనపెట్టుకున్న ఘటనలు మరువక ముందే తాజా దారుణం చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. శ్రీనగర్‌లో మృతి చెందిన వ్యక్తిని బీహార్ రాష్ట్రానికి చెందిన అర్వింద్ కుమార్(37)గా గుర్తించారు. అక్కడి ఈద్గా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. బాధితుడిని వెంటనే స్థానికులు శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక, పుల్వామా జిల్లాలో జరిగిన దాడిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్పెంటర్ సాగిర్ అహ్మద్ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ హత్యలను జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌లో కొద్ది రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగడుతున్న క్రమంలో సంఘ విద్రోహ కార్యకలాపాల కట్టడికి భారీ ఎత్తును పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 700 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారం వ్యవధిలోనే తొమ్మిది ఎన్ కౌంటర్లలో మొత్తం 13 మంది ఉగ్రవాదులు హతమ్యారు.


By October 17, 2021 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-bodies-of-soldiers-recovered-after-48-hour-operation-in-poonch-casualties-now-9/articleshow/87076478.cms

No comments