Breaking News

కేరళలో వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి.. 12 మంది గల్లంతు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్


ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ చిగురుటాకులా వణుకుతోంది. పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లో శనివారం అతి భారీ స్థాయిలో కురిశాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటి మునిగి.. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం ఆరుగురు మృతిచెందగా.. పలువురి ఆచూకీ గల్లంతయ్యింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పథనంతిట్ట, కొట్టాయం సహా మొత్తం ఆరు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌, తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, మలప్పురం, కొజికోడ్‌, వయనాడ్‌ జిల్లాలకు ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం ఉదయం వరకూ అతి భారీ స్థాయిలో, సోమవారం వరకూ భారీగా, మంగళవారం సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి.. కూట్టిక్కల్‌లో సంభవించిన ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతిచెందారు. గల్లంతైన మరో వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇడుక్కి జిల్లా, కాంజార్‌లో వరద నీటిలో కారు కొట్టుకుపోయి అందులోని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో సుమారు 12 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. తిరువనంతపురంలో ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కొల్లాం, కొట్టాయం తదితర చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో పలు పట్టణాలు, కొండ ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొల్లాంలోని తెన్‌మల జలాశయ గేట్లను ఎత్తివేయడంతో సమీప గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో పాలక్కాడ్‌లోని చులియార్‌, త్రిశ్శూర్‌లోని పీచీ జలాశయాల వద్ద అత్యంత అప్రమత్తత అవసరమంటూ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని, పర్యాటక స్థలాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. కొట్టాయంలోని పూంజార్‌లో కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన ఓ బస్సు వరదలో చిక్కుకుపోగా, స్థానికులు అందులోని ప్రయాణికులను రక్షించారు.


By October 17, 2021 at 07:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-dead-many-missing-after-kerala-rain-triggers-floods-landslides/articleshow/87076155.cms

No comments