Delhi జెట్ కాయిల్‌తో అగ్ని ప్రమాదం.. కుటుంబంలోని నలుగురు సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలోని ఓ మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనమయ్యారు. భవనం పై అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన మృతులను ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఇంటి యజమాని హౌరీ లాల్ (58) ఆయన భార్య రీనా (55), కుమారుడు అషు (24), కుమార్తె రాధిక (18) సజీవదహనమైనట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇదే ప్రమాదం నుంచి హౌరీ లాల్ మరో కుమారుడు అక్షయ్ (22) ప్రాణాలతో బయటపడ్డాడు. అక్షయ్ రెండో అంతస్తులో నిద్రపోవడం వల్లే అతడు ప్రాణాలు దక్కాయి. హౌరీ లాల్ శాస్త్రీ భవన్‌లో క్లాస్-4 ఉద్యోగి. ఆయన భార్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. అయితే, దోమల కోసం వెలిగించిన కాయిల్ వల్లే మంటలు అంటుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
By October 26, 2021 at 12:52PM
No comments