Breaking News

‘మా గురించి మేం చూసుకుంటాం’.. ఐరాస నివేదికపై ఉత్తర కొరియా కౌంటర్!


ఉత్తర కొరియాలో మానవ హక్కులు, ప్రజల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐరాస మానవహక్కుల ప్రత్యేక ప్రతినిధి ఈ నెలలో ఓ నివేదికను వెలువరించింది. అయితే, ఈ నివేదిక అంతా బూటకమని, తప్పుల తడకని ఆరోపించింది. తమ దేశంలో మానవ హక్కులు, పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఐరాస మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి టోమస్ ఓజియా క్వింటానా వెలువరించిన నివేదికను ‘ద్వేషపూరిత అపవాదు’గా ఉత్తర కొరియా అభివర్ణించింది. ఇది తమ దేశ వాస్తవ పరిస్థితులను వక్రీకరించిందని మండిపడింది. ఐరాస ప్రతినిధి దేశ వాస్తవ పరిస్థితులను వక్రీకరించడంతోపాటు పౌరుల జీవన విధానంలో జోక్యం చేసుకున్నారని మండిపడింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలను దుర్మార్గంగా పేర్కొన్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ )లో ఆ దేశ మానవహక్కుల ప్రతినిధి వెల్లడించారు. ఆ నివేదికను తాము గుర్తించడం లేదని.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా మద్దతు ఉన్న కార్యక్రమాల్లో ఇదో భాగమని ఆరోపించారు. ‘కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా అంతర్జాతీయ సరిహద్దులను ఉత్తరకొరియా మూసివేయడంతో మరింత ఒంటరిగా మారింది.. బయటి నుంచి ఎలాంటి సాయం అందక, ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉంది’ అని క్వింటానా తన నివేదికలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా స్థానికంగా పరిస్థితులు మరింత దిగజారాయని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ అణ్వాయుధ కార్యకలాపాలపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను సడలించాలని, ఈ దేశానికి మరింత సహాయాన్ని అందించాలని ఆయన సూచించారు. అయితే, దీన్ని ఖండించిన ఉత్తరకొరియా మా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అలా అని మేం ఎవరినీ కోరడం లేదని వ్యాఖ్యానించింది. ‘స్థానికుల భద్రత, జీవనోపాధికి మేమే పూర్తి బాధ్యత వహిస్తాం.. మా గురించి ఆందోళన చెందాలని ఎవరినీ అడగలేదు’ అని పొగరుగా సమాధానం ఇచ్చింది. ‘ప్రత్యేక ప్రతినిధి మన వాస్తవికతను వక్రీకరించడంలో సంతృప్తి చెందకుండా మన ‘ప్రజల జీవనోపాధి’ వైపు వేలెత్తి చూపించాడు.. మహమ్మారిని ఎదుర్కోవటానికి మన స్వంత నిర్దిష్ట అవసరం కోసం ప్రభుత్వం తీసుకున్న అత్యంత వాస్తవిక నిరోధక చర్యలను దుర్మార్గంగా అభివర్ణించాడు’ అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడిందని ఈ ఏడాది జూన్‌లో దేశాధినేత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మహమ్మారి సమయంలో ప్రజలు త్యాగాలు చేశారని పేర్కొన్నారు. వైరస్‌ కట్టడి కోసం దేశంలో సరిహద్దుల మూసివేత, దేశీయ ప్రయాణంపై ఆంక్షలు తదితర కఠిన చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటి వరకూ తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఉత్తర కొరియా ప్రకటిస్తోంది.


By October 27, 2021 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/north-korea-dismisses-un-rights-investigator-tomas-ojea-quintana-report/articleshow/87294621.cms

No comments