Breaking News

పూంచ్ ఎన్‌కౌంటర్‌: ఉగ్రవాదుల గురించి సైన్యానికి కూలీలు సమాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు


జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో 16 రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ చివరి దశకు చేరినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పూంచ్-మెందహార్- రాజౌరీ వద్ద అక్టోబరు 11న మొదలైన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకూ తొమ్మిది మంది సైనికులు అమరులయ్యారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి కొందరు కార్మికులు సైన్యానికి సమాచారం అందిచడంతో పూంచ్‌ ఎన్‌కౌంటర్‌ మొదలైంది. అక్టోబర్‌ 10న భారీ ఆయుధాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు పూంచ్‌లోని ఓ లేబర్‌ క్యాంప్‌కు వెళ్లారు. అక్కడ ఓ కూలీ నుంచి ఫోన్‌ లాక్కొని సమీపంలోని ఆర్మీ క్యాంప్‌ దిశగా వెళ్లడంతో ఈ విషయాన్ని అక్కడివారు సైన్యానికి తెలియజేశారు. దీంతో ఆ ఫోన్‌పై నిఘా పెట్టిన అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పూంచ్‌-రాజౌరీ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఆ ఫోన్ ఉన్నట్లు గుర్తించిన సైన్యం.. ఫోన్ సంభాషణలను విని ఉగ్రవాదులుగా ధ్రవీకరించింది. దీంతో ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలిస్తుండగా.. అక్టోబరు 11న ఒక్క రోజులోనే ఐదుగురు జవాన్లు ఉగ్రతూటాలకు బలయ్యారు. మెందహార్‌, పూంచ్‌ ప్రాంతానికి చెందిన ముగ్గుర్ని అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకొన్నారు. వీరు పూంచ్‌, మెందహార్‌ వద్ద ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ మీదుగా నేపాల్‌కు పారిపోతుండగా అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనిక ఉద్యోగులు పూంచ్‌ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఉగ్రవాదులతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. 2008 డిసెంబర్‌ - 2009 జనవరి మధ్య తొమ్మిది రోజులపాటు బాతా దురియా ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అప్పట్లో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. ఈ సారి కూడా ఉగ్రవాదులు పారిపోయే అవకాశం ఉందని దళాలు అనుమానిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌లో తక్కువ మంది ఉగ్రవాదులే పాల్గొన్నట్టు భావిస్తున్నామని.. ఎంత మంది అనేది స్పష్టతలేదని అన్నాయి. ఇక, కీలక దశకు చేరినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను తరలించి గుహల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న చోట్ల నిప్పుపెట్టడం, లేదా పేలుడు పదార్థాలను వాడి శానిటైజ్‌ చేస్తున్నారు. ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌ స్థలం నుంచి తప్పించుకొన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో పశువుల కాపర్లు నిర్మించుకున్న తాత్కాలిక గృహాలను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అందులో దాక్కొవడం సహా అడవులు దట్టంగా ఉండటంతో భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అక్టోబరు 11న ఎల్‌ఓసీకి పది కిలోమీటర్ల దూరంలో సూరాన్‌కొటే వద్ద తనఖీలు నిర్వహిస్తుండగా ముష్కరుల కాల్పులు జరపడంతో సైనికులు వైశాఖ, జస్వీందర్ సింగ్, మణిదీప్ సింగ్, గజ్జన్ సింగ్, సరాజ్ సింగ్ వీరమరణం పొందారు. అక్టోబరు 15న మెందహార్‌లోని నార్ ఖాస్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో రైఫిల్‌మ్యాన్ విక్రమ్ సింగ్ నేగి, యోగంబర్ సింగ్‌‌లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 16న అజయ్ సింగ్, నాయక్ హరీంద్ర సింగ్‌లు కూడా ముష్కరుల తూటాలకు బలయ్యారు.


By October 27, 2021 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-encouter-first-tip-off-on-poonch-militants-came-from-labourer/articleshow/87295179.cms

No comments