Breaking News

నేనే అన్నాడీఎంకే ప్రధాని కార్యదర్శిని.. శిలాఫలకం ఏర్పాటుచేసి షాకిచ్చిన శశికళ!


తమిళనాడులో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ప్రధాన ప్రతిపక్షం స్వర్ణోత్సవాలను జరుపుకొంటున్న వేళ నెచ్చెలి శశికళ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. మొన్నటికి మొన్న జయ స్మారకం వద్దకు వెళ్లిన శశికళ.. తన వాహనంపై అన్నాడీఎంకే జెండాను పెట్టుకున్నారు. తాజాగా, తానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శినంటూ ప్రకటించుకున్నారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లిన శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. చెన్నైలోని టి.నగర్‌లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద ఆమె ఆ పార్టీకి పోటీగా ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురువేసిన శశికళ.. ఈ సందర్భంగా ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకంలో అన్నాడీఎంకే ‘ప్రధాన కార్యదర్శి ’ అంటూ పెద్ద అక్షరాలతో చెక్కి ఉండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎంజీఆర్‌ మనవడు కుమార్‌ రాసిన ‘ఎనక్కుమట్టుం తెరింద ఎంజీఆర్‌’ (నాకు మాత్రమే తెలిసిన ఎంజీఆర్‌) పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత రామావరం ఎంజీఆర్‌ నివాసానికి వెళ్లి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి ముచ్చటించారు. ఎంజీఆర్‌ బధిరుల పాఠశాలలో విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అన్నాడీఎంకే స్వర్ణోత్సవ సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ సంవత్సరంలో పార్టీ అధికారంలో ఉందని, ఇది ఎంజీఆర్, అమ్మ గౌరవార్థం గర్వించదగిన క్షణమని అన్నారు. అన్నాడీఎంకే వారందరూ ఒక్కటై రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఎంజీఆర్‌ త్యాగం, జయలలిత అంకితభావం, నిబద్ధతల ద్వారా పెరిగిన పార్టీని ఎల్లప్పుడూ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమయంలో ఐక్యత ముఖ్యమని, అంతర్గత విభేదాల కారణంగా శత్రువుకు అధికారం దక్కిందని పేర్కొన్నారు. ప్రజలు, పార్టీ, కార్యకర్తల సంక్షేమంపై శ్రద్ధ చూపకపోతే మనం ఉన్నత పదవుల్లో ఉన్నా పక్కనబెట్టడం ఖాయం.. ఈ సత్యాన్ని మనమందరం గ్రహించాలని శశికళ సూచించారు. పార్టీ, ప్రజలు, కార్యకర్తల కొరకు కలిసి నిలబడాల్సిన సమయం ఇదని పిలుపునిచ్చారు. కాగా.. శిలాఫలకంలో పేరు వేసుకున్నంత మాత్రాన శశికళ ప్రధాన కార్యదర్శి కాలేరని మాజీ మంత్రి డి. జయకుమార్‌ విమర్శించారు.


By October 18, 2021 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jayalalithaa-aid-vk-sasikala-unveils-plaque-naming-her-as-aiadmk-general-secretary/articleshow/87097763.cms

No comments