Breaking News

Kashmir పౌరులపై ఆగని హింస.. మరో ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న ముష్కరులు


జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో నలుగురిని హత్యచేశారు. శనివారం బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వీధి వ్యాపారి, కార్పెంటర్‌ను హత్యచేసిన ఉగ్రవాదులు.. ఆదివారం బిహార్‌కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. కుల్గాంలోని వాన్‌పోహ్‌ ప్రాంతంలో వలస కూలీలు అద్దెకు ఉంటున్న గదిలోకి చొరబడిన తీవ్రవాదులు.. విక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. దీంతో పది రోజుల్లోనే ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల సంఖ్య 11కు చేరింది. వీరిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. స్థానికేతరులపై ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లోయలోని వలస కూలీలను తక్షణమే సమీపంలోని భద్రత దళాల స్థావరాలకు చేర్చాలని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్‌ కుమార్‌ అన్ని జిల్లాల పోలీసు విభాగాలకు అత్యవసర ఆదేశాలు పంపారు. పౌరులపై వరుస దాడులను అక్కడ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అంతకు ముందు జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా రేడియోలో మాట్లాడుతూ ఉగ్రదాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను వేటాడుతామని ప్రకటించారు. సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం కలవరానికి గురిచేస్తోంది. కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రూ, ట్యాక్సీ డ్రైవర్ మొహమూద్ షఫీ లోనే, స్కూల్ టీచర్లు దీపక్ చంద్, సుపూందర్ కౌర్, వీధి వ్యాపారి వీరేంద్ర పాశ్వాన్‌లను గతవారం హత్యచేశారు. తాజా ఘటనలతో కశ్మీర్ లోయ‌లో భయాందోళన వ్యక్తమవుతోంది. కశ్మీరీ వలసవాదులకు ప్రధాన మంత్రి ప్రత్యేక పథకం కింద ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం సహా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడంతో లోయకు వచ్చినవారు తిరిగి వెనుదిరుగుతున్నారు. మరోవైపు, ఉగ్రవాదులకు సహకరిస్తున్నవారిని, అనుమానితులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 900 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పౌరులపై ఉగ్రదాడుల తర్వాత 13 మంది ముష్కరులను వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో హతమార్చారు.


By October 18, 2021 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-bihar-labourers-shot-by-terrorists-in-kashmir-civilian-killings-at-11/articleshow/87098188.cms

No comments