లఖింపూర్ ఖేర్ ఘటన.. సుమోటాగా స్వీకరించిన సుప్రీం.. నేడు సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ
ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులు సహా తొమ్మిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక కేంద్ర మంత్రి కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. కాగా, ఈ కేసును స్వీకరించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టనుంది. కేసు విషయంలో యూపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి యూపీ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా లేఖ రాశారు. మీడియా నివేదికలను దీనికి జతచేసి యూపీ పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టేలా కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారికి చట్టపరంగా శిక్షపడేలా చూడాలని వారు కోరారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా లఖింపుర్ ఖేరి ఘటన తర్వాత తొలిసారిగా బుధవారం తన కార్యాలయానికి వచ్చారు. హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం మిశ్రా మాట్లాడుతూ.. ‘‘హింస చెలరేగినప్పుడు నేను, నా కుమారుడు ఆ ప్రాంతంలో లేం. దీనిపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా సీతాపుర్‌లో నిర్బంధించిన తన భార్య ప్రియాంక వద్దకు వెళ్లకుండా తనను పోలీసులు అడ్డుకున్నారని ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. హింసాత్మక ఘటనలో మృతిచెందిన నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు కుటుంబానికి చెరో రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు పంజాబ్ సీఎం చన్నీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బఘేల్‌లు ప్రకటించారు.
By October 07, 2021 at 08:12AM
No comments