Breaking News

లఖింపూర్ ఖేర్ ఘటన: అతివేగంతో దూసుకొచ్చి ఢీకొట్టిన మంత్రి కారు.. వైరల్ అవుతోన్న తాజా వీడియో


లఖింపూర్ ఖేర్ వద్ద హింసాత్మక ఘర్షణలకు ముందు ఆదివారం ఏం జరిగిందో వెల్లడించే మరో వీడియా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కేంద్ర మంత్రి కుటుంబానికి చెందిన వాహనం స్పష్టంగా కనిపిస్తోంది. రైతులే ముందుగా కర్రలు, రాళ్లతో దాడిచేశారని కేంద్ర మంత్రి, ఆయన కుమారుడు చేసిన ఆరోపణలు నిజం కాదని ఈ వీడియో వెల్లడిస్తోంది. నిరాయుధులైన నిరసనకారుల సమూహంలోకి కారు వేగంగా దూసుకెళ్తుండటం వీడియో ఉంది. మంత్రి అజయ్ మిశ్రా, అతడి కుమారుడు ఆశిష్ మిశ్రా తమ మహీంద్రా ఎస్‌యూవీపై దాడి జరిగిందని చెప్పినవన్నీ అబద్దాలేనని తేటతెల్లమవుతోంది. కారుపై రాళ్లు, కర్రలతో దాడిచేయడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని చెప్పడం నిజం కాదని వీడియో వెల్లడిస్తోంది. ఈ వీడియోలో డ్రైవర్ స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుని, అత్యంత వేగంగా వాహనం నడుతున్నట్టు కనిపిస్తోంది. ఆందోళనలు చేస్తున్నవారిని కారుతో ఢీకొట్టిన తర్వాత మాత్రమే రైతులు ఆగ్రహంతో దాడిచేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట తక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను షేర్ చేశాయి. ఇక, డ్రైవింగ్ సీటులో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. వాహనాన్ని అతడే నడుపుతున్నాడని అంటున్నారు. అయితే, తాను, తన కుమారుడు అక్కడ లేమని మంత్రి చెబుతున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి ముందు రోజే తాజా వీడియో బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. లఖింపూర్ ఖేర్ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు నమోదయ్యింది. అయితే, అతడి ఇంకా అరెస్ట్ చేయలేదు. అటు, మంత్రి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, పంజాబ్, చత్తీస్‌గఢ్ సీఎంలు చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, భూపేశ్‌ బఘేల్‌లను విమానాశ్రయం వద్ద అడ్డుకోవడం హైడ్రామా నెలకుంది. పోలీసుల తీరుతో రాహుల్‌ ధర్నాకు దిగారు. చివరికి సొంత వాహనాల్లో వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. కాంగ్రెస్‌ నేతలు అక్కడి నుంచి బయల్దేరి... సీతాపుర్‌లో ప్రియాంక వద్దకు చేరుకున్నారు. ఆమెతో కలిసి లఖింపుర్‌ ఖేరికి బయల్దేరి వెళ్లారు. బాధిత కుటుంబాలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.


By October 07, 2021 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-violence-new-video-shows-ministers-suv-ram-unarmed-farmers-at-great-speed/articleshow/86828949.cms

No comments