Breaking News

కాంగ్రెస్ సీఎంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. చాలా బాగా పనిచేస్తున్నారని కితాబు!


దేశంలో ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ.. కనీసం ఒక పీజీ వైద్య విద్యాసంస్థనైనా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ దిశగానే కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మోదీ వెల్లడించారు. రాజస్థాన్‌లోని బన్‌స్వారా, శిరోహి, హనుమాన్‌గఢ్‌, దౌసాల్లో నాలుగు వైద్య కళాశాలల నిర్మాణానికి గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. జైపూర్‌లోని సీతాపూర్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ టెక్నాలజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై ప్రశంసలు గుప్పించారు. సీఎం తనపై విశ్వాసం ఉంచి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘నేను రాజస్థాన్ ముఖ్యమంత్రి మాటలు వింటున్నాను. అభివృద్ధి పనులకు సంబంధించి సుదీర్ఘ జాబితాను నా ముందుంచారు.. నాపై ఎంతో నమ్మకం ఉన్నందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. మా ఇరువురి సిద్ధాంతాలు, పార్టీలు వేరు.. కానీ ఈ స్నేహం, నమ్మకం, విశ్వాసం ప్రజాస్వామ్యానికి పెద్ద బలం’ అని గెహ్లాట్‌ను ప్రధాని కొనియాడారు. గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం 170 మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తిచేసిందని.. మరో వంద కళాశాలల పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో రోగాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని.. ఆయుర్వేదం, యోగాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొత్త జాతీయ విధానంతో దేశ ఆరోగ్య రంగంలోని లోపాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో ఆరు ఎయిమ్స్‌లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 22కు పెరగడం సంతృప్తిగా ఉందని అన్నారు. కొవిడ్‌-19 వందేళ్లలో సంభవించిన అతిపెద్ద మహమ్మారని.. ప్రపంచ ఆరోగ్య రంగానికి ఎన్నో పాఠాలు నేర్పిందని ప్రధాని అన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఆరోగ్య రంగంలో స్వావలంబన సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్‌ సంకల్పం తీసుకుందని చెప్పారు. ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి ఉచిత కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఇప్పటివరకు 88 కోట్ల డోసులకుపైగా వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. వైద్య కళాశాలల్లో ఓబీసీలకు, అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎ్‌స)కు రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ.. మొత్తం 33 జిల్లాల్లో 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 15 త్వరలో అందుబాటులోకి రానున్నాయి.. మరో 15 కాలేజీలు 2023 నాటికి ప్రారంభమవుతాయన్నారు. దేశానికి స్వాతంత్ర వచ్చే సమయానికి రాజస్థాన్‌లో జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్ మాత్రమే ఉండేదని, పలు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుతం పరిస్థితి మారిందని తెలిపారు.


By October 01, 2021 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-lays-foundation-stone-for-4-rajasthan-medical-colleges-praises-cm-ashok-gehlot/articleshow/86669694.cms

No comments