Breaking News

తాలిబన్లకు చైనా తొలి సాయం.. అఫ్గన్‌‌కు భారీగా సామాగ్రి


తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గనిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వానికి తొలి విదేశీ సాయం చైనా నుంచి అందింది. మానవతావాద సాయం కింద చైనా నుంచి దుప్పట్లు, జాకెట్లు వంటి అత్యవసర సామాగ్రి బుధవారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అఫ్గన్‌కు మొత్తం 31 మిలియన్ డాలర్ల విలువైన సాయం అందజేయనున్నట్టు ప్రకటించిన చైనా.. తొలి విడతగా ఇవి పంపంది. ఈ సామాగ్రిని అఫ్గన్ మంత్రి ఖలీఫ్ ఉర్ రహ్మానీ హక్కానీకి ఆఫ్ఘన్‌కు చైనా రాయబారి వాంగ్ యూ అందజేసినట్టు చైనా అధికారిక మీడియా జున్హూ గురువారం ఈ వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా వాంగ్ యూ మాట్లాడుతూ.. అనేక ఇబ్బందుల నేపథ్యంలో అఫ్గనిస్థాన్‌కు తక్కువ కాలంలోనే అత్యవసర మానవతావాద సాయాన్ని అందజేయగలిగామని తెలిపారు. అఫ్గన్ ప్రజలకు చలి కాలంలో అత్యవసరమైన దుప్పట్లు, డౌన్ జాకెట్లు వంటివాటిని అందజేశామని పేర్కొన్నారు. ఆహారం తదితర సామాగ్రిను కూడా అందజేస్తామని ఆయన చెప్పారు. చైనా చేసిన సాయానికి అఫ్గన్ ధన్యవాదాలు తెలిపింది. శరణార్థుల వ్యవహారాల మంత్రి ఖలీల్ ఉర్ రెహమాన్ హక్కానీ మాట్లాడుతూ.. మానవతావాద సాయం అందజేసిన చైనాకు ధన్యవాదాలు తెలిపారు. అఫ్గన్‌కు చైనా మంచి పొరుగు దేశమని, మిత్ర దేశమని చెప్పారు. భవిష్యత్తులో కూడా తమకు చైనా సాయపడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. అఫ్గనిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.. జీవనోపాధి కోసం ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం వివిధ రంగాల్లో తమకు అత్యవసరంగా సాయపడాలని ఆయన అభ్యర్ధించారు. పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజం నిబద్ధతలను అప్గన్ గౌరవిస్తుందని తమ భూభాగం నుంచి ఉగ్రవాద గ్రూపులను ఆపరేట్ చేయడానికి అనుమతించబోమని, అందరినీ కలుపుకుని సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గత నెలలో చేసిన ప్రతిజ్ఞను మంత్రి హక్కానీ గుర్తుచేశారు. ఇక, ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే చైనా కూడా తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. ఏదేమైనప్పటికీ కాబూల్‌లో పాకిస్థాన్, రష్యాలతో పాటు తన రాయబార కార్యాలయాన్నీ తెరిచి ఉంది. మిగతా దేశాలన్నీ గత నెలలోనే మూసివేశాయి. సెప్టెంబరు 21-22 తేదీల్లో కాబూల్‌లో రష్యా, చైనా, పాకిస్థాన్ ప్రత్యేక రాయబారులు.. అఫ్గన్ తాత్కాలిక ప్రభుత్వ ఉన్నతాధికారులు, మాజీ నేతలు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా సమావేశమై ఉగ్రవాదంపై పోరు, మానవతా పరిస్థితులపై చర్చించారు. ఇక, అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత చైనా, రష్యా, పాకిస్థాన్‌లు వారితో సన్నిహిత సంబంధాలను నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి.


By October 01, 2021 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-delivers-first-batch-of-humanitarian-aid-to-talibans-interim-afghan-government/articleshow/86670250.cms

No comments