‘ఖాళీలు భర్తీచేయకుంటే ట్రైబ్యునల్స్ మూసేయండి’ కేంద్రంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
ట్రైబ్యునల్స్‌లో నియామాకాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా మండిపడింది. దేశవ్యాప్తంగా వినియోగదారుల కమిషన్లలో ఖాళీల భర్తీపై శుక్రవారం నాటి విచారణ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లు వద్దని ప్రభుత్వం భావిస్తే ఏకంగా వినియోగదారుల హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఈ మేరకు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు తన అధికార పరిధిని దాటి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని పేర్కొంది. వినియోగదారుల ఫోరమ్స్‌లో నియమాకాలను చేపట్టడం ప్రభుత్వం ప్రాథమిక విధి అని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వినియోగదారుల కమిషన్ల నియామకాలు చేపట్టడం లేదని, ఆ వేదికలకు మౌలిక సదుపాయాలను సమకూర్చడం లేదని గమనించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వినియోగదారుల చట్టంలో కొన్ని సెక్షన్లను బాంబే హైకోర్టు కొట్టేసినప్పటికీ నియామకాలకు ఆ తీర్పు అడ్డం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లో అన్ని రాష్ట్రాలు నియామకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలా కానకుంటే సంబంధిత శాఖ కార్యదర్శి సుప్రీంకోర్టు విచారణకు రావాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానాల్లాగే వినియోదారుల వేదికకు కూడా శాశ్వత ప్రాతిపదిక ఉండాలని, న్యాయవ్యవస్థే వాటి నియామకాలను చేపట్టాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను వినియోగదారుల కమిషన్‌కు నియమించడం కూడా సరికాదని జస్టిస్ సుందరేశన్ అన్నారు. వారి నుంచి జవాబుదారీతనాన్ని ఆశించలేమని ఆయన వ్యాఖ్యానించారు. శాశ్వత ప్రాతిపదికన జడ్జిలు వద్దనుకుంటే ఐదేళ్ల కాల వ్యవధిలో కూడా నియామకాలు చేపట్టవచ్చని సూచించారు. ఈ అంశంపై అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్‌ను నియమించింది. ‘న్యాయవ్యవస్థ ఏదో చెబుతుంది.. మీరు అదే నియమాన్ని తిరిగి తీసుకువస్తారు.. న్యాయవ్యవస్థ మళ్లీ చెప్పింది.. కానీ మీరు మళ్లీ అదే పని చేస్తారు.. మీరు గందరగోళాన్ని సృష్టిస్తారు.. బేరసారాలలో పౌరులు బాధపడుతున్నారు.. ఇవి ఒక సామాన్యుడి కోసం పరిహారాలు.. ఉదాహరణకు వినియోగదారుల కోర్టులను తీసుకుంటే... అక్కడ వివాదాలు చాలా పెద్దవి కావు.. కానీ మీరు వాటిని తగ్గించారు’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ లేఖిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల కోర్టుల్లో ఖాళీల భర్తీ విషయమై ప్రభుత్వానికి ఎటువంటి అహం లేదని లేఖి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘మేము నిజంగా చెప్పలేం ... తీర్పు వెలువడింది కానీ మళ్లీ చట్టం అదే నిబంధనలను తిరిగి తెస్తుంది.. తుది ఫలితం ఏమిటంటే, అటువంటి పరిస్థితితో మేం సంతృప్తి చెందలేం’అని తెలిపింది. దేశవ్యాప్తంగా వినియోగదారుల కోర్టుల్లోని దాదాపు 800 ఖాళీలను ఎనిమిది వారాల్లోగా పూర్తిచేయాలని ఆగస్టులో ఆదేశాలు జారీచేశామని, వాటిని తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. అనంతరం కేసు విచారణను నవంబరు 10కి వాయిదా వేసింది.
By October 23, 2021 at 08:14AM
No comments