భద్రతా వలయంలో శ్రీనగర్.. నేటి నుంచి కశ్మీర్‌లో అమిత్ షా పర్యటన
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం నుంచి మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత అమిత్ షా తొలిసారి అక్కడ పర్యటించనున్నారు. శ్రీనగర్ గుప్కార్ రోడ్డులోని రాజ్‌భవన్‌లో బసకు ఏర్పాట్లు చేశారు. దీంతో రాజ్‌భవన్ నుంచి కశ్మీర్ లోయలో 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానికేతరులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కశ్మీర్ లోయను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కీలక ప్రాంతాల్లో స్నిప్పర్స్, షార్ప్ షూటర్లను ఉంచారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు శ్రీనగర్‌లోని సిటీ సెంటర్ నుంచి లాల్ చౌక్ వరకు గగనతలంపై నిఘా పెట్టాయి. శ్రీనగర్‌లో అనుమానాస్పద కదలికలపై డ్రోన్లతో పర్యవేక్షిస్తారు. దాల్ సరస్సు, జీలం నదుల్లో మోటారు బోట్లను సీఆర్పీఎఫ్ బలగాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఉగ్రవాదులను కనిపెట్టేందుకు భద్రతా అధికారులు మఫ్టీలో విధులు నిర్వహిస్తారు. ఎక్కడికక్కడ వాహనాలు, పాదచారుల తనిఖీలు చేపట్టారు. ప్రజలను వేధించడం కోసం కాదని, వారి భద్రత దృష్టిలో పెట్టుకునే సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఢిల్లీ నుంచి వచ్చిన 10 సీఆర్పీఎఫ్ కంపెనీలు, 15 బీఎస్ఎఫ్ టీమ్స్.. శ్రీనగర్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్నాయి. హోంమంత్రి అమిత్‌షా తన పర్యటనలో శనివారం శ్రీనగర్-షార్జా మధ్య విమాన సర్వీసును ప్రారంభిస్తారని సమాచారం. అలాగే ఇటీవల ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన పౌరుల కుటుంబాలతోనూ అమిత్‌షా సమావేశం అవుతారని తెలుస్తోంది. అమిత్ షా అధ్యక్షతన జరిగే యునిఫైడ్ కమాండ్ సమావేశంలో జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై సమీక్షిస్తారని అధికార వర్గాల పేర్కొన్నాయి. ఆదివారం జమ్ములో జన్ సంవాద్ పేరుతో జరిగే బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడాతారని తెలుస్తోంది. అమిత్‌షా వెంట కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్, సీఆర్పీఎఫ్ అధిపతి, ఎన్ఎస్జీ చీఫ్ పర్యటిస్తారు. వీరితోపాటు జమ్మూ కశ్మీర్ డీజీపీ లోయలో భద్రతా సంబంధమైన అంశాలపై అమిత్‌షాతో చర్చిస్తారని భోగట్టా. శుక్రవారం నుంచే డ్రోన్లతోనూ, సీఆర్పీఎఫ్ బలగాలు మోటారు బోట్లతో శ్రీనగర్ అంతటా జల్లెడ పట్టాయి.
By October 23, 2021 at 08:50AM
No comments