Breaking News

ఉత్తరాాఖండ్‌లో వరద విలయం.. 9 మంది పర్యాటకులు సహా 64 మంది మృతి


గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించి దేవభూమి అల్లాడుతోంది. ఇప్పటి వరకూ వరదలకు 64 మంది మృతిచెందారు. శిథిలాలను వెలికితీస్తున్న కొద్దీ గల్లంతైనవారి మృతదేహాలు బయటపడతున్నాయి. తాజాగా, పశ్చిమ్ బెంగాల్ నుంచి పర్వతారోహణకు వచ్చిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బాగేశ్వర్ జిల్లా కుమావ్ ప్రాంతంలోని సుందర్‌దంగా హిమనీనదం వద్ద ఐదు మృతదేహాలను గుర్తించారు. మరో నలుగురు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ మార్గంలో చనిపోయినట్టు అధికారులు తెలిపారు. బాగేశ్వర్ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో సంభవించిన వరదల్లో నుంచి నలుగురిని రక్షించినట్లు బాగేశ్వర్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి శిఖా సుయాల్ చెప్పారు. వరదలకు నైనిటాల్ జిల్లాలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ జిల్లాలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత చంపావత్‌ జిల్లాలో 11 మంది మృతిచెందారు. వరదల్లో 65 మంది పర్యాటకులు చిక్కుకోగా.. కఫ్నీ వద్ద 20 మంది, ద్వాలీ హిమనీనదం వద్ద 34 మంది, సుందర్ దుంగాలో 10 మంది చిక్కుకున్నారని అధికారులు చెప్పారు. కోల్‌కతా నుంచి వచ్చి వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను రక్షించడానికి డెహ్రాడూన్ నుంచి ఒక హెలికాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, మూడు రెస్క్యూ టీంలను పంపించామని అధికారులు చెప్పారు. ద్వాలీ హిమనీనదంలో చిక్కుకున్న 22 మంది పర్యాటకులను రక్షించారు. పితోర్‌గఢ్ జిల్లాలోని దర్మా, వ్యాస్, స్పితి లోయల్లో చిక్కుకున్న 80 మంది పర్యాటకులను భారత సైన్యం చినూక్ హెలికాప్టర్లు గురువారం రక్షించాయని జిల్లా పరిపాలన వర్గాలు తెలిపాయి. చోటా కైలాష్‌ను సందర్శించడానికి ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన 30 మంది పర్యాటకులు గత ఐదు రోజులుగా చిక్కుకుపోయారు. దీంతో వారిని పితోర్‌గఢ్ విమానాశ్రయానికి తీసుకువచ్చామని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ చౌహాన్ చెప్పారు. వీరంతా బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్‌కు చెందినవారే. దాదాపు 17 కంపెనీల ఎన్డీఆర్ఎఫ్, 60 ఎస్డీఆర్ఎఫ్, 15 కంపెనీల పారామిలటరీ దళాలు, 5000 మంది పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పశ్చిమ్ బెంగాల్‌‌కు చెందిన పర్యాటకులు ఉత్తరాఖండ్‌లోని హర్సిల్ నుంచి హిమాచల్‌లోని చిట్కుల్‌కు ట్రక్కింగ్ చేస్తుండగా భారీ హిమపాతంలో చిక్కుకున్నారు. వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడగా.. 9 మంది మృతిచెందారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అపార ఆస్తి నష్టం వాటిళ్లింది. వరద నష్టం రూ.7,000 కోట్లుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించామని ఉత్తరాఖండ్ అన్నారు. ఇది రూ.10,000 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.


By October 22, 2021 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nine-trekkers-among-dead-as-uttarakhand-floods-toll-rises-to-64/articleshow/87197482.cms

No comments