Breaking News

తైవాన్‌పైకి 100కిపైగా యుద్ధ విమానాలు పంపిన చైనా.. అమెరికా వార్నింగ్!


స్వయంపాలిత దీవి తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించి, తన దారికి తెచ్చుకోడానికి చైనా దూకుడును మరింత పెంచింది. వరుసగా గత నాలుగు రోజుల నుంచి భారీగా యుద్ధ విమానాలను పంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. శుక్ర, శనివారాల్లో మొత్తం 77 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టగా, ఆదివారం 16 విమానాలను చైనా పంపింది. తాజాగా సోమవారం మరో 56 యుద్ధ విమానాలు తమ గగనతలంలో చక్కర్లు కొట్టినట్టు తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. చైనాకు చెందిన 36 యుద్ధ విమానలు, అణ్వాయుధ సామర్ధ్యంతో దాడిచేసే H-6 బాంబర్లు 12, మరో నాలుగు ఇతర విమానాలు నైరుతి గగనతల రక్షణ గుర్తింపు జోన్‌లో (ADIZ)కి చొచ్చుకొచ్చాయని తెలిపింది. వీటితో పాటు మరో నాలుగు విమానాలు రాత్రివేళ ప్రవేశించినట్టు పేర్కొంది. చైనా చర్యలపై తైవాన్ మెయిన్‌లాండ్ ఎఫైర్స్ కౌన్సిల్ (ఎంఏసీ) మండిపడింది. ‘తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాలను తీవ్రంగా దెబ్బతీసేలా చైనా వ్యవహరిస్తోంది’ అని ఎంఏసీ అధికార ప్రతినిధి చియూ చుయై అన్నారు. ‘తైవాన్ జలసంధిలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కుట్రపన్నుతున్న చైనా.. ప్రాదేశిక భద్రతకు ముప్పుగా పరిణమించింది.. ఈ బెదిరింపులకు మేము లొంగిపోయి రాజీకి వచ్చే ప్రసక్తే లేదు’ అని తేల్చిచెప్పారు. ADIZ తైవాన్ ప్రాదేశిక గగనతలంతో సమానంగా ఉండదు.. కానీ చైనా సొంత వైమానిక రక్షణ గుర్తింపు జోన్‌లో కొంత భాగం ఇందులో ఉంది. స్వయంపాలిత ప్రజాస్వామ్య తైవాన్ ద్వీపాన్ని చైనా స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. తన భూభాగంగానే పరిగణిస్తోన్న డ్రాగన్.. అవసరమైతే బలవంతంగా ఒక రోజు దానిని స్వాధీనం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ఇక, గత శుక్రవారం నుంచి తైవాన్‌ గగనతలంలోకి వందకు పైగా చైనా యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాంతీయ స్థిరత్వం, ప్రశాంతతకు భంగం కలిగించొద్దంటూ చైనాకు హితవు పలికింది. ప్రాదేశి శాంతి, స్థిరత్వాలకు విఘాతం కలిగించేలా చైనా వ్యవహరిస్తోందంటూ మండిపడింది. ‘‘తైవాన్‌పై సైనిక, దౌత్య, ఆర్థిక ఒత్తిడిని, బలవంతపు చర్యలను చైనా ఆపాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌కు పూర్తి సహాయసహకారాలను అందిస్తామని స్పష్టం చేసింది.


By October 05, 2021 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-sends-56-fighter-jets-and-nuclear-capable-bombers-to-taiwan-air-defence-zone/articleshow/86770139.cms

No comments