Breaking News

Taliban అఫ్గన్‌లో కొత్త ప్రభుత్వం.. ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన వ్యక్తి హోం మంత్రి!


అఫ్గనిస్థాన్‌లో సర్కారు ఏర్పాటు విషయంలో మల్లగుల్లాలు పడిన తాలిబన్లు.. ఎట్టకేలకు ఊహాగానాలకు తెరదించారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్లు.. ‘రహబరీ శూరా’ విభాగం అధినేతగా ఉన్న ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ను ప్రధానిగా ప్రకటించారు. మరో అగ్రనేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌‌ డిప్యూటీ ప్రధానిగా నియమితులయ్యారు. మొత్తం 33 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక క్యాబినెట్ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. అమెరికా సైన్యాలతో పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన అగ్ర నేతలకే కీలక పదవులు దక్కడం విశేషం. తాలిబనేతర నేతలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటూ అంతర్జాతీయ సమాజం చేసిన సూచనలను బేఖాతరు చేశారు. హక్కానీ నెట్‌వర్క్‌ ఉగ్రసంస్థ అధినేత సిరాజుద్దీన్‌ హక్కానీకి అత్యంత కీలకమైన హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. మహిళలకు కనీసం చోటు దక్కలేదు. అఫ్గన్‌లో నూతన ఇస్లామిక్‌ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయినట్టు తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. ‘క్యాబినెట్‌ కూర్పు ఇంకా పూర్తికాలేదు. ఇది తాత్కాలికమే. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకూ మంత్రిమండలిలో చోటుకల్పించేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తాజా ప్రభుత్వంలో హజరా వర్గానికి చోటు దక్కలేదు. కాందహార్‌కు చెందిన ముల్లా హసన్.. 1996-2001 మధ్య అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. తాలిబన్‌ ముఠాలోని నాయకత్వ మండలి ‘రహబరీ శూరా’ విభాగానికి 20 ఏళ్లుగా ముల్లా హసన్‌ నేతృత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది హక్కానీ నెట్‌వర్క్‌ అధినేత సిరాజుద్దీన్‌ హక్కానీ అఫ్గన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తాలిబన్లతో పాటు అల్‌-ఖైదాతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. అతడిపై అమెరికా ఇప్పటికే 50 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది. అఫ్గన్‌లో అమెరికా, నాటో దళాలపై జరిగిన పలు బాంబు డాలు వెనుక సిరాజుద్దీన్‌ హస్తం ఉంది. 2008లో అప్పటి అఫ్గన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ని హత్య చేసేందుకు కుట్ర పన్నినవారిలో ఈయన ఒకరు కావడం గమనార్హం.


By September 08, 2021 at 07:35AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-unveils-new-cabinet-us-designated-terrorist-in-afghanistan-interior-minister/articleshow/86026248.cms

No comments