Breaking News

Happy Birthday Pawan Kalyan: ఎంతమంది ఉన్నారనేది కాదు ఎవడున్నాడనేదే ముఖ్యం.. పవర్ హౌస్ ఈ జనసేనాని


ఈ పేరు వింటేనే జనాల్లో ఓ అలజడి. ఇందులోనే ఉంది అసలైన పవర్. ఈ పదం చెవిన పడితే చాలు రోమాలు నిక్కబొడుస్తూ ఉప్పొంగే ఉత్సాహం. ఆయన తెర మీద కనిపిస్తే అభిమానులకు పూనకాలు. పవర్ స్టార్ అంటే చాలు సినీ ఇండస్ట్రీనే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులకు అదో కిక్కు. ఇలా పవన్ గురించి చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే రాయొచ్చు. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి రాజకీయ కండువా కప్పుకున్న ఈ 'వకీల్ సాబ్' క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగా కాపౌండ్ హీరోగా సినీ గడపతొక్కి తనకు మాత్రమే సొంతమైన టాలెంట్‌తో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూ కోట్లాది మంది గుండెల్లో పవర్‌ఫుల్ హీరోగా నిలిచిపోయారు. పవన్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో జాతర షురూ అయినట్లే. పవర్ స్టార్, పవర్ స్టార్ అంటూ థియేటర్స్‌లో మోత మోగాల్సిందే. ఫ్యాన్స్ పూనకాలతో ఊగి పోవాల్సిందే. ఇక వెండితెరపై పవన్ డైలాగ్స్ వింటుంటే వచ్చే ఆ కిక్కు మాటల్లో చెప్పగలమా!. అలాంటి హీరో పుట్టిన రోజు సెప్టెంబర్ 2. దీన్నే మెగా అభిమానుల పండగ రోజు అని కూడా చెప్పుకోవచ్చు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల చేత 'సుస్వాగతం' పలికించుకొని మెగాస్టార్ మెచ్చిన 'తమ్ముడు'గా, టాలీవుడ్ 'బంగారం'గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు పవన్. 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు- అంజనా దేవి దంపతులకు జన్మించిన పవన్ అంచలంచెలుగా ఎదిగి మెగా అభిమానులను 'ఖుషీ' చేస్తూ సినీ ఇండస్ట్రీలో ఏ నాటికీ చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించుకున్నారు. చిన్నతనం నుంచే సమాజం పట్ల అవగాహన పెంపొందించుకున్న పవన్ కళ్యాణ్ జనం కోసం కదలివచ్చి 'జనసేన' పార్టీ స్థాపించారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పేర్కొన్న ఈ పవర్ హౌస్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, అక్రమార్కులపై ఎక్కుపెడుతూ వస్తున్నారు. 'ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు ఎవడున్నాడనేదే ముఖ్యం' అన్నట్లుగా జనసైనికుడిగా రాజకీయ రంగంలో చక్రం తిప్పుతున్నారు. తనదైన శైలిలో జనాన్ని మేల్కొల్పుతున్నారు. స‌మాజంపై ఎన‌లేని బాధ్య‌త.. తోటి వ్య‌క్తి కోసం ఏమైనా చేయాల‌న్న త‌ప‌న.. జన బలమే తన బలం అనుకునే తత్వం. ఇవ‌న్నీ ప‌వ‌న్ విశిష్ట వ్య‌క్తిత్వానికి తార్కాణాలు. రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 'వకీల్ సాబ్' సినిమాతో రికార్డులు తిరగరాశారు. పవన్ రాకతో యావత్ సినీ లోకం పండగ చేసుకుంది. రీ- ఎంట్రీలో పవన్ దూకుడు చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గతంలో వెంకటేష్‌తో కలిసి ‘గోపాల గోపాల’ మల్టీస్టారర్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు దగ్గుబాటి రానాతో 'భీమ్లా నాయక్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు వరుస సినిమాలు ఓకే చేస్తూ అటు రాజకీయం, ఇటు సినిమాల్లో హవా నడిపిస్తున్నారు. ఇదే హవా, ఇదే జోష్ చిరకాలం నిలవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్‌కి సమయం తెలుగు తరఫున ప్రత్యేకంగా 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.


By September 02, 2021 at 07:11AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/birth-day-special-story-on-power-star-pawan-kalyan/articleshow/85854509.cms

No comments