గర్ల్ ఫ్రెండ్ దొరకడంలేదు.. ప్లీజ్ నా సమస్యను పరిష్కరించండి.. ఎమ్మెల్యేకు యువకుడు లేఖ!
తనకు ప్రియురాలు దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు ఏకంగా తన నియోజకవర్గ ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ లేఖను మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన యువకుడు భూషణ్ జాంబవంత్ రాథోడ్ రాశారు. యువకుడు రాసిన ఈ లేఖ రాజౌరా కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ ధోతేకు అందలేదు కానీ, వాట్సాప్‌లో చూశానని తెలిపారు. ఓ కార్యకర్త ఈ లేఖను వాట్సాప్ ద్వారా తనకు పంపారని పేర్కొన్నారు. హిందీలో రాసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘మా తాలుకాలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.. ఏ ఒక్క అమ్మాయి కూడా నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు.. గద్‌చందూర్ నుంచి రాజౌరా మధ్య గ్రామీణ ప్రాంతాల్లో రోజూ ప్రయాణిస్తుంటాను.. భవిష్యత్తులో నాకు ప్రియురాలు దొరుకుతుందన్న నమ్మకం కూడా సన్నగిల్లుతోంది.. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటి వాళ్లకు ప్రియురాలు దొరకట్లేదు.. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న యువతులను ప్రోత్సహించండి’’ అని భూషణ్ తన లేఖలో విజ్ఞప్తి చేశాడు. ఈ లేఖపై మాట్లాడుతూ.. ‘పోస్టు ద్వారా తనకు ఆ లేఖ రాలేదన్నారు. కానీ, ఓ కార్యకర్త వాట్సాప్ ద్వారా పంపారు. యువకుడి గురించి ఆరా తీయగా ఆ పేరుతో ఎలాంటి వివరాలు లభించలేదు. అతడి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెదుకుతున్నారు.. యువకుడ్ని కలిసి మాట్లాడుతాను.. ఒకవేళ యువకుడి ఆచూకీ లభిస్తే తన సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాను.. కానీ, ఇటువంటి లేఖ రాయడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. వాట్సాప్‌లో వచ్చిన లేఖలో భూషణ్ జాంబవంత్ రాథోడ్ అనే పేరు ఉంది. అయితే, అలాంటి పేరున్న యువకుడ్ని ఇంకా గుర్తించకపోవడంతో ఈ లేఖపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేవలం అందరి దృష్టిని ఆకర్షించేందుకు గుర్తుతెలియని వ్యక్తి ఇలా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబరు 10న ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.
By September 16, 2021 at 08:40AM
No comments