Breaking News

హురియత్ నేత గిలానీ కన్నుమూత.. కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం.. నిలిచిపోయిన ఇంటర్నెట్


కశ్మీర్ వేర్పాటువాది, నేత సయ్యద్ అలీషా గిలానీ (92) బుధవారం రాత్రి కన్నుమూశారు. శ్రీనగర్‌లోని తన నివాసంలో ఆయన రాత్రి 10.30 గంటలకు మృతిచెందారు. తొలిసారిగా 2018 మార్చిలో స్వల్ప గుండెపోటుకు గురయిన ఆయన ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌లో ప్రముఖ నేత అయిన గిలానీ.. వయసు పైబటడంతో కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్నారు. గిలానీ మృతిని మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ధ్రువీకరించారు. అనేక విషయాల్లో ఆయనతో తాను ఏకీభవించి ఉండకపోవచ్చని, అయితే నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా ఆయనంటే తనకెంతో గౌరవమని ఓ ట్వీట్‌లో మెహబూబూ ముఫ్తీ పేర్కొన్నారు. గిలానీ మరణం తనను విచారంలో ముంచెత్తిందని, ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయాభిలాషులకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. గిలానీ తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని మరో కశ్మీరీ నేత సజ్జద్ లోన్ అన్నారు. గతంలో జమాత్-ఇ-ఇస్లామీ కశ్మీర్ సభ్యుడిగా ఉన్న.. ఆ తర్వాత తెహ్రిక్-ఇ-హురియత్‌ను స్థాపించారు. ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1929 సెప్టెంబర్ 29న బందిపోర జిల్లాలో జన్మించిన ఆయన లాహోర్‌లోని ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నారు. జమాతే ఇస్లామీలో చేరక ముందు కొన్నేళ్లు టీచర్‌గా పనిచేశారు. 1972,76,87లో సోపోర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 2020లో హురియత్‌ నుంచి తప్పుకున్నారు గిలానీ మరణంతో కశ్మీర్ లోయలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. కొంత మంది హురియత్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. సీనియర్ నేత ముఖ్తార్ అహ్మద్ వాజాను అనంత్‌నాగ్ పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.


By September 02, 2021 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-separatist-politicians-syed-ali-shah-geelani-passed-away/articleshow/85858094.cms

No comments