Breaking News

దారుణం.. జవాన్‌ను కాళ్లతో ఇష్టం వచ్చినట్టు తన్ని, ఈడ్చికొట్టిన పోలీసులు


మాస్క్ వేసుకోలేదనే కారణంతో ఆర్మీ జవాన్‌ను పోలీసులు దారుణంగా కొట్టిన ఘటన ఝార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో ఝార్ఖండ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనకు కారణమైన ఇద్దరు అధికారులు సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఘటనపై ఛత్రా ఎస్పీ కార్యాలయ అధికారులు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఛత్రా పట్టణంలోని కర్మా బజార్ ప్రాంతంలో ఆర్మీ జవాన్ పవన్ కుమార్ యాదవ్‌పై పోలీసులు జులం చూపించారు. మాస్క్ వేసుకోలేదని ఆయన చెంపలు వాయించి, దారుణంగా కొట్టి, కాళ్లతో తన్నడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. కరోనా నిబంధనలు అమల్లో భాగంగా పోలీసులు మాస్క్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. జవాన్ పవన్ కుమార్ బైక్‌పై మాస్క్ పెట్టుకోకుండా రావడం కంటపడింది. దీంతో బైక్‌ను ఆపిన పోలీసులు.. బండి తాళాలు లాగేసుకున్నారు. పోలీసుల చర్యను జవాన్ తీవ్రంగా నిరసిస్తూ తన బైక్ తాళాలు ఇవ్వాలని అడిగారు. పవన్ కుమార్, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. చుట్టుపక్కల ఉన్న మిగతా కానిస్టేబుల్స్ అక్కడకు చేరుకుని దారుణంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్పింగ్‌లో జవాన్ మాస్క్ ధరించనట్టు స్పష్టంగా కనబడుతోంది. అనంతరం జవాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పవన్ కుమార్‌ది ఛత్రా సమీపంలోని ఆరా-భూషాహి గ్రామం కావడంతో ఈ విషయం తెలిసిన గ్రామస్థులు భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. మయూర్‌హండ్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టడంతో అధికారులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ఛత్రాపూర్ జిల్లా ఎస్పీ రాకేశ్ రంజన్.. తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎస్పీతో మాట్లాడిన స్థానిక ఎంపీ సునీల్ కుమార్ సింగ్.. జవాన్ పట్ల దురుసగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక ఆధారంగా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.


By September 02, 2021 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/army-jawan-thrashed-mercilessly-by-jharkhand-cops-over-mask-in-jharkhands-chatra/articleshow/85857429.cms

No comments