తాలిబన్ల అకృత్యాలు.. ప్రత్యర్థులను చంపి జంక్షన్‌లో శవాలు వేలాడదీత!
అఫ్గనిస్థాన్‌లో ఏర్పడిన తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం గత పాలనను గుర్తుచేస్తోంది. తప్పుచేసినవారికి, దొంగతనాలకు పాల్పడినవారికి బహిరంగ ఉరి, చేతులు నరకివేత వంటివి మళ్లీ కొనసాగుతాయని తాలిబన్ నేత ఇటీవలే ప్రకటించారు. తాజాగా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా రద్దీగా ఉండే కూడళ్ల వద్ద మృతదేహాలను వేలాడదీస్తున్నారు. హెరాత్ పట్టణంలోని ఓ ప్రధాన కూడలి వద్ద క్రేన్ సాయంతో శనివారం నాలుగు శవాలను వేలాడదీసినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియా వర్గాలకు తెలిపాయి. అయితే తండ్రీకుమారులను కిడ్నాప్ చేసేందుకు నలుగురు దుండుగులు యత్నించారని, నేరానికి పాల్పడటంతో కాల్చిచంపి శిక్ష వేశామని సమర్ధించుకున్నారు. వారిలో ఓ మృతదేహాన్ని హెరాత్ కూడలిలో వేలాడదీశామని, మిగతా మూడు శవాలను కూడా వేలాడదీసేందుకు ఇతర పట్టణాలకు తరలించామని తెలిపారు. హోరాత్ ప్రావిన్సుల డిప్యూటీ గవర్నర్ మావ్‌లావీ షిర్ అహ్మద్ ముజాహిర్ మాట్లాడుతూ.. కిడ్నాప్‌లను ఉపేక్షించబోమని ‘పాఠం’ నేర్పడానికి నలుగురు దుండగులను హత్యచేసి, ఆ రోజున వారి శవాలను వివిధ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించారని తెలిపారు. ‘మేం ఇస్లామిక్ ఎమిరైట్స్‌లో ఉన్నాం.. దేశానికి ఏ ఒక్కరూ హాని తలపెట్టలేరు.. కిడ్నాప్‌లకు ఆస్కారం లేదు.. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడ్ని రక్షించారు. తండ్రీ కొడుకులను అపరహరించిన దుండగులు డబ్బులు డిమాండ్ చేశారని’ పేర్కొన్నారు. హెరాత్ జిల్లా పోలీసు చీఫ్ జియావుల్‌హక్ జలాని మాట్లాడుతూ.. నలుగురు కిడ్నాపర్ల నుంచి తండ్రి, కుమారుడిని రక్షించి దుండగులను హతమార్చినట్లు వెల్లడించారు. కిడ్నాపర్లు జరిపిన కాల్పుల్లో ఓ తాలిబన్ ఫైటర్‌తోపాటు ఓ పౌరుడు గాయపడినట్లు పేర్కొన్నారు. అని ఎదురు కాల్పుల్లో ఆ నలుగురిని హతమార్చామని చెబుతున్నా.. ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. అఫ్గనిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు గతవారం వెల్లడించారు. తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ మాట్లాడుతూ.. గతంలో తాము బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శించాయని, కానీ తామెప్పుడూ ఆయా దేశాల చట్టాలు, శిక్షల గురించి మాట్లాడలేదన్నారు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదని, మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు.
By September 26, 2021 at 08:55AM
No comments