Modi Addresses At Un పాకిస్థాన్, చైనాలకు ఐరాస వేదికగా మోదీ చురకలు
ఐక్యరాజ్యసమితి 76వ సర్వ ప్రతినిధి సభ సమావేశానికి శనివారం హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్, చైనాలకు మోదీ చురకలంటించారు. ఉగ్రవాదాన్ని ఓ రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమని పాక్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా నిర్మించిన ప్రపంచ పరిపాలన సంస్థల విశ్వసనీయత కోవిడ్ -19 పుట్టుక, సులభతరం వాణిజ్యం ర్యాంకింగ్ వంటి సమస్యల నిర్వహణతో దెబ్బతిన్నాయని పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చైనాపై మోదీ విరుచుకుపడ్డారు. ప్రపంచ బ్యాంకు డేటాను చైనా తారుమారుచేసి తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోవడం, కోవిడ్ మూలాలపై దర్యాప్తు విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సహకరించకపోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఐరాస ప్రసంగంలో ప్రధాని ప్రస్తావించారు. అలాగే, భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని, ఒకప్పుడు టీ అమ్ముకున్న నేను దేశానికి ప్రధానిని కాగలగడమే దానికి ప్రబల నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటి దేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తుండడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ‘రైల్వే స్టేషన్ టీ స్టాల్‌లో విక్రయాలు జరపడంలో ఒకనాడు తండ్రికి సహకరించిన నేను ఈరోజు భారత ప్రధానిగా ఐరాసను ఉద్దేశించి నాలుగోసారి ప్రసంగిస్తున్నాను. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి నేను 20 ఏళ్లు సేవ చేసినట్లవుతుంది. అంత్యోదయ (ఎవరినీ విస్మరించకుండా ఉండటం) అనే సూత్రంతో భారత్ మున్ముందుకు సాగుతోంది. సమ్మిళితంగా, సార్వత్రికంగా, అందరికీ ఫలాలు పంచేదిగా అభివృద్ధి ఉండాలి’ అని చెప్పారు. ఇదే సమయంలో అఫ్గన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడటం చాలా అవసరమని మోదీ పునరుద్ఘాటించారు. ‘ప్రస్తుత తరుణంలో అఫ్గనిస్థాన్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి మహిళలు, చిన్నారులు, మైనారిటీలకు సహాయం అవసరం.. మనం మన బాధ్యతను నెరవేర్చాలి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు అఫ్గనిస్థాన్ భూభాగాన్ని స్వార్థపూరితంగా ఏ ఒక్క దేశం ఉపయోగించుకోకుండా చూడటం చాలా ముఖ్యం’ అన్నారు. ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ సాధనంగా వాడుకుంటున్నవారు అది తమకూ పెనుముప్పు అనే విషయాన్ని గుర్తించాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిబంధనల ఆధారిత ప్రపంచం కోసం అంతర్జాతీయ సమాజం ఒకే గొంతుక వినిపించాలన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి మహా సముద్రాలు జీవన రేఖ వంటివనీ, విస్తరణవాదం బారిన పడకుండా వాటిని పరిరక్షించుకోవాలని చెప్పారు. ‘సేవా పరమో ధర్మః అనే సూత్రంపై భారత్ నడుస్తుంది. అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే సొంతంగా కోవిడ్-19 వ్యాక్సిన్లు తయారు చేసింది. మానవాళి పట్ల బాధ్యతతో ప్రపంచంలో అవసరమైనవారికి టీకాల ఎగుమతిని మళ్లీ ప్రారంభించాం.. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్త టీకా తయారీదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.. భారత్‌కు రండి... మా వద్ద వ్యాక్సిన్లను తయారు చేయండి’ అని పిలుపునిచ్చారు.
By September 26, 2021 at 07:59AM
No comments