Breaking News

తాలిబన్ల వికృత చర్యలు.. మహిళల ర్యాలీని కవర్ చేశారని జర్నలిస్ట్‌లపై దాడి


అఫ్గన్‌లో తాలిబన్ల అరాచకాలు షరా మూమూలయ్యాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలపై తాలిబన్ మూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల హెరాత్‌లో ఆందోళన చేపట్టిన మహిళలను తాలిబన్ సైన్యం దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా, మంగళవారం పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాక్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆగ్రహం చెందిన తాలిబన్లు.. ఆ మహిళలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. దీనిని కవర్‌ చేస్తోన్న జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్‌లపైనా దాష్టీకానికి పాల్పడ్డారు. వారిపై దాడులకు దిగిన పలువురిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అలాగే, మహిళల నిరసన ప్రదర్శనను కవర్‌ చేస్తుండగా తనను అదుపులోకి తీసుకున్నారని, కొన్ని గంటల తర్వాత వదిలిపెట్టారని ఓ జర్నలిస్టు తెలిపారు. ఆ సమయంలో తనపట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు. ‘ఆ వార్తను కవర్‌ చేసినందుకు నా ముక్కు నేలకు రాయమని ఆదేశించారు. ప్రాణభయంతో నేను ఆ పని చేయక తప్పలేదు’ అని ఆ జర్నలిస్టు వాపోయారు. మరో జర్నలిస్ట్‌ను కాలితో తన్ని, ఐడీ కార్డును లాగేసుకుని, కెమెరాను ధ్వంసం చేశారు. తాలిబన్లు అరెస్టు చేసినవారిలో అఫ్గన్‌లోని ప్రముఖ ఛానెల్ ‘టోలో న్యూస్‌’ కెమెరామెన్‌ వాహిద్‌ అహ్మది ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. మీడియా సంస్థ అధినేత లోట్‌ఫుల్లా నజాఫిజాదా విన్నపంతో అతడిని మూడు గంటల తర్వాత విడిచిపెట్టినట్లు పేర్కొంది. కెమెరాను సైతం వెనక్కి ఇచ్చేశారని, కెమెరామెన్‌తో సహా మరో 12 మందిని కూడా విడిచిపెట్టినట్లు నజాఫిజాదా ట్విటర్‌‌లో వెల్లడించారు. ఈ వార్తలను కవర్‌ చేస్తున్న తమ జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారని అరియానా న్యూస్‌ అనే మీడియా సంస్థ ప్రకటించింది. జర్నలిస్టు హయత్‌ బైసీతోపాటు, అతడి సహచరుడు సమీ జహేష్‌, కెమెరామెన్‌ సమిమ్‌లను తాలిబన్లు అరెస్టు చేసినట్లు తెలిపింది. రెండు గంటల తర్వాత వారిని వదిలేసినట్లు పేర్కొంది.


By September 08, 2021 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-attacks-journalists-during-woman-protest-at-kabul-airport/articleshow/86026760.cms

No comments