Breaking News

తాలిబన్లతో చైనా ఒప్పందం.. ఆ విషయం నాకూ తెలుసు.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు


అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లతో కలిసి పనిచేయడానికి ఓ అవగాహన ఒప్పందాన్ని చేసుకోడానికి ప్రయత్నిస్తోందని ఖచ్చితంగా చెప్పగలనని అమెరికా అధ్యక్షుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు. అమెరికా చట్టం ప్రకారం నిషేధం విధించిన తాలిబన్ బృందానికి చైనా నిధులు సమకూరుస్తుందని ఆందోళన చెందుతున్నారా? అని అడిగితే.. ‘చైనాకు తాలిబాన్‌లతో నిజమైన సమస్య ఉంది. కాబట్టి వారు తాలిబాన్‌లతో ఏదో ఒక ఏర్పాటుకు ప్రయత్నించబోతున్నారు, ఆ విషయం నాకు తెలుసు’ అన్నారు. అమెరికా, దాని ఏడు మిత్రదేశాల కూటమి తాలిబాన్ల విషయంలో సమస్వయంతో ముందుకెళ్లాలని అంగీకారానికి వచ్చాయి. అలాగే, అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్ ఆస్తులు, నిధులను తాలిబాన్‌ల‌కు దక్కకుండా సీజ్ చేసింది. వీటిలో ఎక్కువ భాగం న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్‌లో ఉన్నాయి. మహిళల హక్కులు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరుతోంది. కానీ చైనా, రష్యా లేదా ఇతర దేశాలు తాలిబాన్లకు నిధులు సమకూర్చితే ఆ ఆర్థిక సమస్య చాలా వరకు సమసిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా, రష్యా వంటి కీలక దేశాలు సభ్యులుగా ఉన్న 20 కూటమి.. అఫ్గనిస్థాన్‌లో పరిణామాలపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. అయితే, దీనిపై తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇదిలా ఉండగా, ఆగస్టు 29న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్‌లో మాట్లాడుతూ.. తాలిబన్ల విషయంలో అంతర్జాతీయ సమాజం సానుకూల దృక్పథంతో చూడాలని కోరారు. కానీ, తాలిబన్ పాలనను చైనా అధికారికంగా గుర్తించకపోయినా కానీ, జులైలో తాలిబన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుతం అఫ్గన్ డిప్యూటీ ప్రధానిగా నియమితులైన తాలిబన్ నేత ముల్లా బరాదర్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం చైనాలో పర్యటించింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రిని కలిసి, తమ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇచ్చారు.


By September 08, 2021 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-will-work-out-arrangement-with-taliban-says-us-president-joe-biden/articleshow/86027133.cms

No comments