SC: నేరస్థుడికీ వాదించుకునే అవకాశమివ్వాలి.. జస్టిస్ లలిత్ సంచలన వ్యాఖ్యలు
నిందితుడికి సైతం న్యాయస్థానంలో తన వాదనను వినిపించుకొనేందుకు అవకాశాలివ్వాలని, ఇది చట్టబద్దమైన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ వ్యాఖ్యానించారు. నేర పరిశోధన, విచారణ ఏ దశలోనూ ఏ నిందితుడూ ప్రాతినిధ్యం వహించకుండా ఉండేలా.. నిందితులకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ అందుకు సంబంధించిన సమాచారంతో కూడిన బోర్డులను ఉంచాలని ఆయన సూచించారు. హరియాణా న్యాయసేవల విభాగం ఆధ్వరంలో ఏడాది పొడవునా నిర్వహించే ‘అందరికీ న్యాయం చేకూరడానికి సేవల నాణ్యత ముఖ్యం’ అనే కార్యక్రమాన్ని జస్టిస్ లలిత్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటువంటి బోర్డులను హరియాణాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. చట్టబద్దమైన సమాజంలో తప్పుడు చర్యలకు పాల్పడిన ఒక నేరస్థుడిని శిక్షించాల్సి ఉన్నప్పటికీ, న్యాయసహాయం పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులలో భాగమని స్పష్టం చేశారు. ‘తప్పుచేసిన వ్యక్తిని శిక్షించడం చట్టబద్ధమైన సమాజంలో ముఖ్యం.. అతడి తప్పుడు చర్యలకు శిక్ష అనుభవించాల్సిందే.. కానీ, ఇదే సమయంలో నిందితుడు తన వాదనను వినిపించుకొనేందుకు అవకాశమివ్వడం ఇది చట్టబద్దమైన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత’ అని జస్టిస్ లలిత్ అన్నారు. ‘పోలీస్ స్టేషన్లలో న్యాయసేవలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచడం అనేది నేర విచారణలో నిందితుడు ఏ దశలోనూ ప్రాతినిధ్యం వహించకుండా ఉండటానికి మొదటి అడుగు.. తద్వారా ప్రతి వ్యక్తి తనను తాను రక్షించుకోడానికి అవకాశం ఏర్పడుతుంది’ అని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏడాదిన్నర కాలంగా మొత్తం మానవాళి వెనకడుగు వేసినప్పుడు విర్చువల్ విధానం పరిష్కార మార్గంగా అవతరించిందని జస్టిస్ లలిత్ అన్నారు. ఏదేమైనా, ఈ పరిస్థితి మెరుగుపరచడం, ఆవిష్కరించడం, మనలోని ఉత్తమమైన వాటిని బయటకు తీయడం కూడా నేర్పింది. ‘వర్చువల్ ప్లాట్‌ఫాం పరిష్కార వేదికగా ఉండవచ్చని కోవిడ్ మాకు నేర్పింది.. ఇక్కడ మా సమస్యలు చాలా వరకు పరిష్కరించబడతాయి.. ఈ రోజున న్యాయస్థానాలు విర్చువల్ విధానంలోనే విచారణలు జరుపుతున్నాయి’అని వ్యాఖ్యానించారు.
By August 02, 2021 at 07:28AM
No comments