Breaking News

Pegasus Row పెగాసస్‌పై ఎట్టకేలకు పెదవి విప్పిన కేంద్రం.. రాజ్యసభలో కీలక ప్రకటన


దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం నోరువిప్పింది. ప్రారంభానికి ముందు రోజే ఈ వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పార్లమెంట్‌ను విపక్షాలు స్తంభింపజేసినా.. ఇన్ని రోజూలు కేంద్రం స్పందించలేదు. విపక్షాలు పట్టువీడకపోవడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ఇజ్రాయేల్‌కు చెందిన స్పైవేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో తాము ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని సోమవారం రాజ్యసభలో రక్షణశాఖ స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ టెక్నాలజీస్‌తో రక్షణ శాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? అని సీపీఎం సభ్యుడు వి.శివదాసన్‌ ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని ఆయన అడిగారు. దానికి రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆ సంస్థతో ఎలాంటి లావాదేవీలు తాము జరపలేదని తేల్చిచెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో రక్షణ శాఖ వాటా 15.49% ఉందన్నారు. దేశ భద్రత, సైన్యం కోసం వినియోగించే పెగాసస్ స్పైవేర్‌ను కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం.. దేశంలోని ప్రముఖులపై నిఘా కోసం వాడుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతాయి. పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలోని 300 మంది ప్రముఖుల ఫోన్‌లను హ్యాక్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించడంతో దుమారం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ సింగ్ పటేల్, అశ్విణ్ వైష్ణవ్, వ్యాపారవేత్తలు అనిల్ అంబానీ, మాజీ సీబీఐ డైరెక్టర్ సహా కనీసం 40 మంది జర్నలిస్ట్‌ల ఫోన్‌లు హ్యాకింగ్ గురయినట్టు పేర్కొన్నాయి. మీడియాలో వచ్చిన నివేదికలను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటిదేమీ లేదని ప్రకటించింది. అనధికారికంగా పెగాసస్‌ను స్వప్రయోజనాల కోసం వినియోగించడం సాధ్యంకాదని వెల్లడించింది. అటు, ఈ అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గతవారం దీనిపై విచారణ ప్రారంభమయ్యింది. మీడియాలో వచ్చిన నివేదికలు నిజమైతే ఇది తీవ్రమైన వ్యవహారమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


By August 10, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-govt-first-time-response-in-parliament-amid-pegasus-spyware-row/articleshow/85198280.cms

No comments