Breaking News

ప్రియురాలి కోరిందని మారు వేషంలో ఆమె పరీక్షకు.. అడ్డంగా బుక్కయిన యువకుడు!


ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధపడే యువకులను చూసుంటారు. ప్రియురాలు కోరితే కష్టమైనా వెనుకాడరు. తాజాగా ఓ యువకుడు తన ప్రియురాలు కోరిందని ఆమె పరీక్షను రాయడానికి మారువేషంలో వచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ప్రేమికులిద్దరూ చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. విచిత్రమైన ఈ ఘటన సెనెగల్‌లోని డైయోర్బెల్ అనే పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖాదీం బౌప్ (22) అనే యువకుడు గంగూ దియూమ్ (19) అనే యువతి ప్రేమలో ఉన్నారు. స్థానిక సెయింట్ లూయీస్ యూనివర్సిటీలో గంగూ గ్రాడ్యుయేషన్‌ చదువుతోంది. పరీక్షలు జరుగుతుండగా.. ఇంగ్లిష్‌లో అంతగా పట్టులేని ప్రియురాలు గంగూకు ఓ ఆలోచన వచ్చింది. ఎలాగైనా పరీక్షల్లో పాస్‌ కావాలంటే పరీక్షను తన బాయ్‌ఫ్రెండ్‌‌తో రాయించాలని అనుకుంది. ఈ విషయం తన ప్రియుడికి తెలపడంతో అతడు సరేనంటూ రెచ్చిపోయాడు. అచ్చం ఆమెలాగానే అలంకరించింది. పొడువైన జట్టున్న విగ్‌, చెవిపోగులు, మేకప్, డ్రెస్‌తో పాటు ముఖాన్ని కప్పిపుచ్చేందుకు తలపై సంప్రదాయ స్కార్ఫ్‌తో రెడీ చేసింది. ప్రియురాలు చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ.. మూడు రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఖాదీం మాయచేసి పరీక్షలు రాశాడు. మూడు రోజుల వరకూ వారి ఆటలు సాఫీగానే సాగినా.. నాలుగో రోజు బెడిసికొట్టింది. పరీక్ష హాల్‌లోకి వచ్చిన ఇన్విజిలేటర్‌కి ఖాదీం తీరుపై అనుమానం వచ్చింది. వెంటనే అధికారులకు సమాచారమిచ్చి గుట్టురట్టు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే పరీక్ష హాల్‌కు చేరుకొని తొలుత ప్రియుడు ఖాదీంను అదుపులోకి తీసుకున్నారు. తరువాత ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంగ్లీష్‌పై అంతగా పట్టులేకపోవడంతో ఎలాగైనా పరీక్షల్లో గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే ఆమె చెప్పినట్టు చేశానని విచారణలో వెల్లడించాడు. ఆమె కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని అంగీకరించాడు. ఏది ఏమైనా ఒకరికి బదులు ఇంకొకరు పరీక్ష రాయడం నేరం కావడంతో అనంతరం ఉన్నతాధికారులు వారిని రెండేళ్ల పాటు ఎటువంటి పరీక్షలు రాయకుండా నిషేధించారు. న్యాయస్థానం ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.


By August 10, 2021 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/boyfriend-came-to-take-the-exam-instead-of-girlfriend-as-a-girl-in-senegal/articleshow/85198612.cms

No comments