Breaking News

వచ్చే ఇరవై ఏళ్లలో పెరగనున్న భూతాపం.. అదే జరిగితే ప్రపంచానికి భారీ నష్టం.. ఐరాస సంచలన నివేదిక


ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతాపంపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) సోమవారం వెల్లడించిన నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్రమట్టాల పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు... ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దమంతా కొనసాగుతుందని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగితే.. తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరించింది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు... ఇక నుంచి పదేళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. భూతాపం ఒక్క డిగ్రీ మేర పెరిగితే ఈ ముప్పు ప్రతి ఏడేళ్లకు రెండుసార్లు ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకుముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మార్క్‌ను దాటే ప్రమాదముంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది’’ అని హెచ్చరించారు. ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం... భూతాపాన్ని 1.5 డిగ్రీల మేర తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.. 2030 నాటికి ఇది 1.5 డిగ్రీల మేర పెరిగిపోతుంది అని ఐపీసీసీ హెచ్చరించింది. భూతాపంపై ఐపీసీసీ నివేదికను ‘మానవాళికి రుధిర సంకేతం’గా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులూ, ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తును ఎదుర్కొంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో మొత్తం 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొనగా.. 3 వేలకుపైగా పేజీల్లో దీన్ని రూపొందించారు. ‘‘ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్‌ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి.. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. కర్బన ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది.. మిగతా వాటితో పోల్చితే హిందూ మహాసముద్రం త్వరగా, ఎక్కువ వేడెక్కుతోంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి.. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్‌లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది’ అని నివేదికలో రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న ఫ్రెడరిక్‌ ఓటో అనే శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి, కరవు పరిస్థితులు అధికమవుతాయని పరిశోధనలో పాలుపంచుకున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాపికల్‌ రీసెర్చ్‌కు చెందిన క్లైమేట్ ఛేంజ్ రిసెర్చ్ సెంటర్ ఈడీ ఆర్‌.క్రిష్ణన్‌ పేర్కొన్నారు. పట్టణీకరణకు, పట్టణాల్లో వర్షపాతం పెరగడానికి మధ్య సంబంధం ఉందని చెప్పారు. ‘ప్రపంచ పారిశ్రామికీకరణకు ముందు నుంచే 1850 నుంచి 1900 మధ్య సగటు ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల మేర పెరిగాయి.. కార్బన్‌-డై-ఆక్సైడ్‌, మీథేన్‌ వంటి వాతావరణాన్ని వేడెక్కించే వాయువుల విడుదల ఆరంభమైంది. బొగ్గు, కలప, సహజ వాయువులను మండించడమే ఇందుకు ప్రధాన కారణం. ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రకృతి శక్తుల పాత్ర చాలా స్వల్పం’ అని పేర్కొంది. ‘ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతోందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి.. వేడి గాలులు, కరవు, తుపాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయి.. ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా, భీకరంగా సంభవించే ముప్పుంది’ అని హెచ్చరించింది. మంచు కరగడం వల్ల సముద్రాల్లో నీటి మట్టాలు పెరిగి.. ఆక్సిజన్‌ స్థాయులు తగ్గి, అవి మరింతగా ఆమ్లీకరణం చెందుతాయి. ఇదే జరిగితే... వందల, వేల సంవత్సరాలపాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే.. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. తీర ప్రాంతాలు ఆ మేర నీట మునుగుతాయి.


By August 10, 2021 at 06:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/global-temperature-likely-to-rise-1-5c-in-20-years-un-ipcc-report-warning/articleshow/85198003.cms

No comments